ఏ మాయ చేసావేపై సంచలన వ్యాఖ్యలు చేసిన గౌతమ్ మీనన్


ఏ మాయ చేసావేపై సంచలన వ్యాఖ్యలు చేసిన గౌతమ్ మీనన్
ఏ మాయ చేసావేపై సంచలన వ్యాఖ్యలు చేసిన గౌతమ్ మీనన్

సినిమా మీద ఉన్న ప్యాషన్ తో నటులు, దర్శకులు, నిర్మాతలు అవుదామని ఇండస్ట్రీకి వస్తుంటారు చాలా మంది. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఇక్కడ సక్సెస్ లో ఉన్నవాడు చెప్పిందే నడుస్తుంది. సినిమా మీద ప్యాషన్ తో వచ్చే దర్శకులు, కథల విషయంలో ఒక్కోసారి కాంప్రమైజ్ కారు. తాము నమ్మిందే జరగాలని లేదంటే తనలోని దర్శకుణ్ణి, క్రియేటర్ ను చంపేసినట్లు ఫీల్ అయిపోతారు. అల్టిమేట్ గా ఎవరికైనా కావాల్సింది విజయం మాత్రమే. నీ ప్యాషన్ కొద్దీ నీ దురదను తెచ్చి అందరికీ రుద్దుతాను అంటే కుదరదు. అప్పుడు నువ్వే డబ్బులు పెట్టి నీకు నచ్చినట్లు తీసుకోవాలి. ఇతరుల అభిప్రాయాలు తీసుకోకుండా నేను డైరెక్టర్ ని, నేను చెప్పిందే జరగాలి అంటే, సినిమా అనేది కోట్లలో వ్యాపారం. ఏ నిర్మాత దర్శకుడి ప్యాషన్ తీర్చడానికి సినిమాలు తీయాలి అనుకోడు. సినిమాకు మంచి జరుగుతుంది అంటే నువ్వు నమ్మింది సడలించడానికి ముందుకు రావాలి. దానివల్ల నీలోని ఫిల్మ్ మేకర్ ను చంపేశారు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది.

ఇప్పుడిదంతా ఎందుకంటే విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ సెన్సిబుల్ సినిమాలు తీస్తాడన్న పేరుంది. ఈయన నుండి వచ్చిన ఒక క్లాసిక్ గా ఏ మాయ చేసావే గురించి ప్రస్తావించుకుంటారు తెలుగు ప్రేక్షకులు. ప్రేమ కథల్లో ఈ సినిమాకు సముచిత స్థానమిస్తారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత మధ్యన కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ మాయ చేసావే ఆ ఏడాది విడుదలైన అతి పెద్ద హిట్స్ లో ఒకటి. అంత పెద్ద హిట్ అయిందంటే ఏ దర్శకుడైనా ఆనందిస్తాడు కానీ గౌతమ్ మీనన్ ఈ సినిమాతో అసలు సంతృప్తిగా లేడట. అసలు దీన్ని సినిమానే కాదంటున్నాడు. దీనికి కారణం క్లైమాక్స్ లో తను చేయాల్సొచ్చినా మార్పు వల్లేనట. నిజానికి గౌతమ్ మీనన్ రాసుకున్న స్క్రిప్ట్ లో హీరో, హీరోయిన్ కలవరు. హీరో తీసిన సినిమాలో మాత్రమే కలుస్తారు. శింబు, త్రిషలతో తీసిన తమిళ సినిమా అలాగే ఉంటుంది. అయితే తెలుగు ప్రొడ్యూసర్ మంజుల ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో పట్టుబట్టిందట. స్యాడ్ ఎండింగ్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఇష్టపడరు, హ్యాపీ ఎండింగ్ చేయమని ఒత్తిడి చేసిందిట. తప్పక గౌతమ్ మీనన్ కాంప్రమైజ్ అయ్యి తెలుగులో హ్యాపీ ఎండింగ్ కింద తీసాడు.

కట్ చేస్తే తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా, తమిళంలో యావరేజ్ గా మారింది. ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమా గొప్పదా లేక తన ప్యాషన్ తీర్చుకోవాలని తీసిన సినిమా గొప్పదా అంటే గౌతమ్ మీనన్ తన దృష్టిలో తమిళ వెర్షన్ మాత్రమే సినిమా అని, తెలుగు వెర్షన్ విషయంలో తనకు సంతృప్తిని ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. అయితే నాగ చైతన్య, సమంతతో పనిచేయడాన్ని ఆస్వాదించానని లాస్ట్ లో చిన్న కవరింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన తూటా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.