గీతా ఆర్ట్స్ లైనప్ అదిరిందిగా!


Geetha arts new productions with young heroes
Geetha arts new productions with young heroes

టాలీవుడ్ లో ప్రస్తుతం యాక్టివ్ గా ప్రొడక్షన్ హౌసెస్ లో ప్రముఖమైనది గీతా ఆర్ట్స్ సంస్థ. దీన్నుండి వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించినవే. ఇన్నాళ్లు భారీ బడ్జెట్ చిత్రాలే నిర్మిస్తూ వచ్చిన గీతా ఆర్ట్స్ గత కొంత కాలం నుండి రూటు మార్చి చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను కూడా తీసుకుంటున్నారు. దాని కోసం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను కూడా స్థాపించారు. ఈ బ్యానర్ లోనే చిన్న సినిమాలను అందించనున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు గీతా ఆర్ట్స్ మరో కొత్త పంథా కూడా అనుసరిస్తోంది. అదే సినిమాను వేరే నిర్మాణ సంస్థతో పంచుకోవడం, అదే సంయుక్తంగా సినిమాలను నిర్మించడం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు భవిష్యత్తులో చేయబోతున్న సినిమాలు కూడా ఇదే కోవకు చెందనున్నాయి.

గీతా ఆర్ట్స్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ తో కలిపి సంయుక్త నిర్మాణంగా రూపొందుతోంది. అల వైకుంఠపురములో తర్వాత కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలపై గీతా ఆర్ట్స్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ హీరోగా ఒక సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. అర్జున్ సురవరంతో డీసెంట్ హిట్ ను అందుకున్న నిఖిల్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించిన చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనుంది గీతా ఆర్ట్స్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశముంది. ఈ చిత్రంతో పాటు గీతా ఆర్ట్స్ మరో రెండు సినిమాలను లైన్లో పెడుతున్నట్లు సమాచారం.

ఈ రెండూ కూడా యంగ్ హీరోలతో చేసే చిత్రాలే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ప్రమోషన్ల హంగామా సాగుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. నిన్న విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ తో నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని తెలుస్తోంది. అలాగే మరో యంగ్ హీరోతో కూడా ఒక సినిమా నిర్మించనుందిట. ఈ మూడు చిత్రాలు కూడా వచ్చే ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేస్తోంది గీతా ఆర్ట్స్. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది. మొత్తానికి గీతా ఆర్ట్స్ హంగామా మాములుగా లేదు.