మరో సినిమాను మొదలుపెట్టేసిన యాక్షన్ హీరో


Gopichand
మరో సినిమాను మొదలుపెట్టేసిన యాక్షన్ హీరో

యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గోపీచంద్ ను ప్రేక్షకులు పూర్తిగా విస్మరించే పరిస్థితి వస్తుంది. అయితే హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా గోపీచంద్ తన పని తాను చేసుకుని వెళ్తున్నాడు. అతను నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య దసరాకు విడుదల కావడానికి ముస్తాబవుతోంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈలోగానే గోపీచంద్ తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం తెరకెక్కించబోయే ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. నేపాల్, థాయ్ ల్యాండ్, కంబోడియాలలోని అందమైన లొకేషన్లలో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. మిగతా నటీనటులను త్వరలో ఎంపిక చేసి షూటింగ్ కు వెళతామని చిత్ర యూనిట్ ప్రకటించింది .