కష్టాల ఊబిలో ప్రయాణిస్తున్న గోపీచంద్

కష్టాల ఊబిలో ప్రయాణిస్తున్న గోపీచంద్
కష్టాల ఊబిలో ప్రయాణిస్తున్న గోపీచంద్

మొదట్లో విలన్ వేషాలతో ప్రేక్షకులకు చేరువైన గోపీచంద్, తర్వాత హీరోగా మారి తనదైన ముద్ర వేసాడు. వరసగా సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన గోపీచంద్ తనకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే గోపీచంద్ ఇటీవలే హిట్ ఇచ్చి చాలా కాలమైంది. లౌక్యం తర్వాత గోపీచంద్ సక్సెస్ చూసిందే లేదు. ఈ ఐదేళ్ళలో చాలా సినిమాలే చేసిన గోపీచంద్ ఒక్కటంటే ఒక్క సక్సెస్ సినిమా కూడా అందించలేదు. కనీసం యావరేజ్ సినిమా కూడా స్కోర్ చేయలేదు. గోపీచంద్ నుండి వచ్చిన లాస్ట్ రెండు సినిమాలు పంతం, చాణక్య అయితే మరీ ఘోరం. కలెక్షన్లలోనే కొత్త లో ను నమోదు చేసాయి. గోపీచంద్ కంటూ ఇప్పుడు ఒక మార్కెట్ లేదు. అయితే ఇంకా అతని సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో ఎంతో కొంత వస్తోంది కాబట్టి అరకొర నిర్మాతలైనా గోపీచంద్ కు అందుబాటులో ఉన్నారు.

ప్రస్తుతం కెరీర్ ను మళ్ళీ రివైవ్ చేసుకునే పనిలో పడ్డ గోపీచంద్ తాజాగా తన మేనేజర్ ను తీసేశాడని తెలుస్తోంది. ఈ మేనేజర్ గోపీచంద్ తో ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. చాలా సినిమాలకు కూడా ఉన్న ఆ మేనేజర్ ను గోపీచంద్ తప్పించడం వెనకాల గోపీచంద్ ఫెయిల్యూర్స్ ఒక కారణమట. తనకు సరైన సినిమాలు రానివ్వకుండా చేశాడన్న కారణంతో గోపీచంద్ ఆ మేనేజర్ ను తప్పించినట్లు తెలుస్తోంది. కొన్ని మంచి కథలు తనదాకా రాకుండా చేసాడని అనుకుంటున్నాడు గోపీచంద్. అయితే ఇందులో ఆ మేనేజర్ తప్పు కన్నా గోపీచంద్ స్వయం కృతాపరాధమే ఎక్కువున్నట్లు ఎవరికైనా అర్ధమవుతుంది.

కేవలం కథల ఎంపికలో గోపీచంద్ చేసిన పొరబాట్లే తన ఫెయిల్యూర్స్ కు కారణమని ఇప్పటికీ తను గ్రహించినట్లు అనిపించట్లేదు. లౌక్యం తర్వాత మన యాక్షన్ హీరో కథల ఎంపికలో చాలానే తప్పులు చేసాడు. ప్రేక్షకులు తన నుండి ఎలాంటి సినిమా ఆశిస్తున్నారో తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. పైగా అందరూ కొత్తదనం అంటూ అటువైపు అడుగులు వేస్తున్న సమయంలో గోపీచంద్ ఇంకాఆ పాత చింతకాయ పచ్చడి అంటూ అదే తరహా సినిమాలు, యాక్షన్ అంటూ అవే సీన్లు చేయడం అతడికే శాపంగా మారింది. చాణక్య అంటూ స్పై థ్రిల్లర్ అని చెప్పి, కమర్షియల్ అంశాల పేరిట జరిగిన ట్రాజెడీ మనందరం చూసాం.

ఇప్పటికైనా గోపీచంద్ కళ్ళు తెరవకపోతే చాలా కష్టం. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. టాప్ దర్శకులతోనే అవసరం లేదు, కనీసం మీడియం బడ్జెట్ లో టైర్ 2 లో ప్రామిసింగ్ దర్శకులతో జట్టు కట్టినా సరిపోతుంది. అలా కాదని తన ఇమేజ్, తెలుగు ప్రేక్షకుల అభిరుచి పట్ల అవగాహన లేని తమిళ దర్శకులతో పని చేసి ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు గోపీచంద్.

ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నందితో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. దర్శకుడు సంపత్ నంది కాబట్టి కొత్తదనం ఆశించాల్సిన అవసరం లేదు. అయితే దీని తర్వాత రెండు కథలను విన్నాడు. అవైనా గోపీచంద్ కు మంచి చేయాలని కోరుకుందాం.