గోపీచంద్ పని మొదలెట్టేసాడు


Gopichand upcoming film shooting started
Gopichand upcoming film shooting started

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా కెరీర్ ఇప్పుడు బాగా డౌన్ లో ఉంది. 2014లో వచ్చిన లౌక్యం తర్వాత గోపీచంద్ కు హిట్ అన్నదే లేదు. 2015లో జిల్ యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత నుండి అన్ని సినిమాలు ప్లాపయ్యాయి. సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్, ఆరడుగుల బులెట్, పంతం, చాణక్య ఇలా అన్ని సినిమాలు వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. లాస్ట్ మూడు సినిమాలు అయితే మినిమం కలెక్షన్స్ అన్నవి లేకుండా పోయాయి. అయితే గోపీచంద్ ప్రస్తుతం మరో కొత్త సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే. తనతో గౌతమ్ నంద తీసిన సంపత్ నంది దర్శకత్వంలోనే ఈ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. గౌతమ్ నంద సినిమా ప్లాపైనా కూడా గోపీచంద్ మరో అవకాశం ఇచ్చాడు.

తాజా సమాచారం ప్రకారం ఈరోజు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా ఎంపికైన విషయం తెల్సిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. గోపీచంద్ ఇందులో మహిళల కబడ్డీ టీమ్ కు కోచ్ గా వ్యవహరిస్తాడని సమాచారం. గోపీచంద్ ఆంధ్ర టీమ్ కు కోచ్ అయితే, తమన్నా తెలంగాణ టీమ్ కు కోచ్ గా వ్యవహరించనుందని తెలుస్తోంది. యూ టర్న్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తోంది.

గోపీచంద్ ప్రధాన బలం అంటే యాక్షన్ సీక్వెన్స్ లనే చెప్పాలి. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రంలోనే చాలా ప్రభావంతమైన యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని సమాచారం. ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.