నిజమైన హీరోలకు సపోర్ట్ చెయ్యండి – విశ్వక్ సేన్


Happy birthday Vishwak Sen
Happy birthday Vishwak Sen

“జీవితంలో అయినా సినిమా ఇండస్ట్రీలో అయినా పనికట్టుకుని ఎవరు మనకి సహాయం చేయటం ఉండదు.! మనకున్న సొంత టాలెంట్ ని నమ్ముకొని, ఒక అడుగు ముందుకేసి, ధైర్యం చేసి, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనే డిగ్రీలు మనకు మనమే ఇచ్చుకోవాలి. మన కాళ్ళపై మనం నిలబడినప్పుడు మాత్రమే ప్రపంచం మనకేసి చూస్తుంది. తర్వాత మంచి అవకాశాలు ఇవ్వడం మొదలు పెడుతుంది.” ఈ విషయాన్ని పక్కాగా నమ్మిన వ్యక్తి విశ్వక్ సేన్. ఆయన మొదటి సినిమా “వెళ్ళిపోమాకే” దగ్గరనుంచి తర్వాతి సినిమా “ఈ నగరానికి ఏమైంది.?” లో అయితే వివేక్ అనే పాత్రలో ఎక్కువ శాతం మంది యువత తమని తాము చూసుకున్నారు

 “నన్ను ఎవడూ లేపక్కర్లేదు; నన్ను నేనే లేపుకుంటా..!”అని అన్న డేరింగ్ అండ్ డాషింగ్ హీరో విశ్వక్ సేన్.నిజానికి నిజాలు మాట్లాడటానికి చాలా గట్స్ ఉండాలి. మామూలుగా ప్రజలని అభిమానులని అలరించడానికి రెడీమేడ్ స్పీచ్ లు చాలామంది మాట్లాడుతారు. కానీ మనలో ఉండే ఒకడు, మన పక్కనే ఉండే ఒకడు హీరోగా మారి స్టేజ్ మీద మాట్లాడితే ఎలా ఉంటుందో..! విశ్వక్ మాట కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్లోలో ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు ఏదైనా తెలియక మాట్లాడినా కూడా వెంటనే సంజాయిషీ  చెప్పేంత ఉన్నతమైన మనస్తత్వం విశ్వక్ సేన్ ది.

ఇక మలయాళంలో ఘనవిజయం సాధించిన “అంగమలై డైరీస్” సినిమాని ఇక్కడ మన హైదరాబాద్ సంస్కృతికి తగినట్లు మార్చి పూర్తిస్థాయిలో వెండితెరపై ఆవిష్కరించిన విశ్వక్ సేన్ ఆ సినిమాని చాలా సహజంగా చిత్రీకరించారు. తను ఒక హీరోలా కాకుండా… సినిమాలో ఒక పాత్ర గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇటీవల వచ్చిన హిట్ సినిమాలో విక్రమ్ రుద్రరాజుగా మన చేత కనీసం గుటక కూడా వేయించకుండా సినిమా మొత్తం చూసేలా చేసారు.

ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరించకుండా.. దేశవ్యాప్తంగా 21 రోజుల క్రితం పాటిస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ ఇంటివద్ద సురక్షితంగా ఉండమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన విడుదల చేసిన భావోద్వేగపరమైన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. పరిస్థితులు చక్కబడే అని మళ్ళీ ప్రపంచం మునుపటిలాగా ఇంకా మంచిగా మారాలని… ప్రజలందరూ ఎవరి పనుల్లో వారు సంతోషంగా ఉండాలని.. భగవంతుని ప్రార్థించడంతో పాటు మన వంతు కర్తవ్యంగా కరోనా వైరస్ పై ప్రత్యక్షంగా పోరాటం చేసే వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు సిబ్బంది మరియు ఎంతోమంది నిజమైన హీరోలకు వారి బాధ్యత నిర్వర్తించే విధంగా మనం సహకారం అందించాలని… విశ్వక్ సేన్ కోరుతున్నారు.

ఒక కళాకారుడిగా, ఒక మనిషిగా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన విశ్వక్ సేన్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. మంచి మంచి సినిమాలు మనకు అందించాలని ఆశిస్తున్నాం.