మైత్రిలో హరీష్ శంకర్ కు పనేంటి?


మైత్రిలో హరీష్ శంకర్ కు పనేంటి?
మైత్రిలో హరీష్ శంకర్ కు పనేంటి?

మొత్తానికి ఒకటైతే క్లియర్.. ఎప్పుడొస్తాడో తెలీదు కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే మీడియాలో చాలా కథనాలు వచ్చేసాయి. ఒకసారి పవన్ వస్తున్నాడని, ఒకసారి రావట్లేదని ఇలా రకరకాల వార్తలు మీడియా వారు వండి వార్చారు. ఫైనల్ గా పవన్ పింక్ రీమేక్ తో పునరాగమనం చేస్తున్నాడని అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే అప్పటికి కూడా పవన్ బహిరంగంగా ఒప్పుకోలేదు. తాను సినిమాల్లోకి వస్తానో రానో తెలీదు కానీ సినిమాలు నిర్మిస్తానని తెలిపాడు. ఒకేసారి రీ ఎంట్రీ అంటే విమర్శలు వస్తాయేమోనని ఈ రకంగా స్టేట్మెంట్ ఇప్పించారు. ఏదేమైనా పవన్ సినిమాల్లోకి మళ్ళీ రావడం ఖాయం.

పవన్ సినిమాల్లోకి వస్తున్నాడని తెలియగానే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలు అలెర్ట్ అయ్యారు. పవన్ మళ్ళి రాజకీయాల్లో బిజీ అయ్యేలోగా తమకేమైనా ఛాన్స్ ఉంటుందేమోనని ప్రయత్నాలు ముమ్మరం చేసారు. అయితే పవన్ కళ్యాణ్ ముందు అందరూ ఊహించినట్టుగానే పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వేణు శ్రీ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రం గురించి మిగిలిన వివరాలు త్వరలో తెలుస్తాయి.

పింక్ రీమేక్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ తో సినిమా చేయనున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాలను కేవలం 8 నెలల గ్యాప్ లో పూర్తి చేయాలని పవన్ చెబుతున్నాడట. వచ్చే ఏడాదే ఈరెండు సినిమాలు విడుదల కావాలని, ఆ ప్రకారం షూటింగ్స్ ప్లాన్ చేయమని ఆర్డర్స్ వేసాడట. అయితే క్రిష్ తో సినిమా పూర్తయ్యాక తమకేమైనా ఛాన్స్ ఉంటుందేమోనని మైత్రి మూవీస్ వారు పవన్ తో మాట్లాడుతున్నారట. ఈ విషయమై పవన్ కు, మైత్రి నిర్మాతలకు మీటింగ్ కూడా జరిగిందని అంటున్నారు. పవన్ మూడో సినిమా అంటూ కుదిరితే అది మీకే అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయాల్లోకి రాకముందే మైత్రి మూవీస్ పవన్ కు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయాక అడ్వాన్స్ తిరిగి ఇస్తానంటే మైత్రి వారు ఒప్పుకోలేదు. పవన్ దగ్గరే ఉంచమని చెప్పారు. ఇప్పుడు అది మైత్రి మూవీ మేకర్స్ కు ప్లస్ అవుతోంది. పవన్ చేయబోయే రెండు చిత్రాల తర్వాత మొదటి ప్రిఫరెన్స్ వారికే ఉంటుంది.

దాంతో మైత్రి మూవీ మేకర్స్ పవన్ కు సరిపోయే కథ, దర్శకుడు కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో డైనమిక్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ నిర్మాతలను కలిసినట్లు సమాచారం. కుదిరితే తన దర్శకత్వంలోనే పవన్ తో సినిమా తీయమని కోరాడట. హరీష్ శంకర్ ఇటీవలే వాల్మీకి చిత్రంతో హిట్ కొట్టాడు. డీజే తర్వాత మరో సినిమా పట్టుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు హరీష్. మధ్యలో దాగుడుమూతలు అనే స్క్రిప్ట్ అనుకున్నా హీరోలు కలిసి రాక రీమేక్ చేయాల్సొచ్చింది. అయితే ఇప్పుడు పవన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం హరీష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.