బంగార్రాజు గురించి మాట్లాడవేంది నాగార్జున?


Has Bangarraju Shelved
Has Bangarraju Shelved

అక్కినేని నాగార్జున కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా సోగ్గాడే చిన్ని నాయన గురించి చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బయ్యర్లకు భారీ లాభాలు ఆర్జించి పెట్టింది సోగ్గాడే చిన్న నాయన. ఈ సినిమా హిట్ అయిన ఆనందంలో నాగార్జున దీనికి ప్రీక్వెల్ ఉంటుందని బంగార్రాజు పేరుతో సినిమాను తెరకెక్కిస్తామని తెలిపాడు. ఇదంతా మూడేళ్ళ క్రితం మాట. అప్పటినుండి బంగార్రాజు గురించి ఏదొక వార్త వస్తూనే ఉంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ కురసాల బంగార్రాజు స్క్రిప్ట్ మీద చాలా నెలలు కూర్చున్నాడు. కానీ నాగార్జున నుండి సై అన్న మాట ముందుకు రాలేదు. ఆలోగా టైమ్ వేస్ట్ అనుకున్నాడో ఏమో మధ్యలో రవితేజతో నేల టికెట్ సినిమా తీసాడు. అయితే ఆ సినిమా దారుణంగా విఫలమవడంతో కళ్యాణ్ కృష్ణకు అది పెద్ద ఎదురుదెబ్బలా నిలిచింది.

కళ్యాణ్ కృష్ణ క్రెడిబిలిటీ మీద సందేహాలు వచ్చేలా చేసిన చిత్రంగా నేల టికెట్ నిలిచింది. అయినా కళ్యాణ్ కృష్ణ పట్టు వదలకుండా మళ్ళీ బంగార్రాజు స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు. అయితే ఈసారి నాగార్జున కు స్క్రిప్ట్ నచ్చిందని, షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అన్నారు. కానీ నాగార్జున మాత్రం మన్మథుడు 2 సినిమా ఒప్పుకున్నాడు. బంగార్రాజు మీద ఈ కన్ఫ్యూజన్ ఏంటో జనాలకు అర్ధం కాలేదు. అయితే బంగార్రాజు పై వార్తలు మాత్రం ఆగలేదు. మన్మథుడు 2 పూర్తవ్వగానే బంగార్రాజు పట్టాలెక్కుతోంది అన్నారు. ఈసారి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా నాగ చైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడని ఎస్ చెప్పాడని కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఈసారి న్యూస్ కన్ఫర్మ్ అనుకున్నారు.

కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ మన్మథుడు 2 షూట్ అవుతుండగానే నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 కు ఓకే చెప్పేసాడు. షో వీకెండ్స్ లోనే ఉంటుంది కానీ నాగార్జున బంగార్రాజు విషయంలో సంతృప్తిగా లేడని కళ్యాణ్ కృష్ణను కొన్ని మార్పులు సూచించాడని వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ అవ్వగానే ఈ సినిమా పక్కా అన్నారు. అసలు ఒక సినిమా గురించి ఇన్ని వార్తలు రావడం ఏంటో, వీటిపై నాగార్జున మౌనం వహించడం ఏంటో కూడా జనాలకు అర్ధం కాలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్నది కూడా క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ పూర్తై రెండు వారాలు పూర్తయినా కూడా నాగార్జున నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అంటూ ఏ వార్తా రాలేదు.

మరోవైపు వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగార్జున బంగార్రాజు మీద ఆశలు వదిలేసుకున్నాడని అంటున్నారు. ఎంత కన్విన్స్ అవుదామనుకుంటున్నా బంగార్రాజు స్క్రిప్ట్ అనుకున్న విధంగా రావట్లేదని సోగ్గాడే చిన్ని నాయనకు ఉన్న పేరుని చెడగొట్టడం ఇష్టం లేక బంగార్రాజు వదిలేద్దామని అనుకుంటున్నాడట. అందుకే బిగ్ బాస్ నుండి పూర్తిగా ఫ్రీ అయ్యి కొత్త కథలను వింటున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా బంగార్రాజు మీద వార్తలు తగ్గుతాయా లేదా అన్నది చూడాలి.