“జయ”హో “భీష్మ” – నితిన్ బర్త్ డే స్పెషల్

Hero Nithiin Birthday special
Hero Nithiin Birthday special

చూడటానికి మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. మన పక్కింటి అబ్బాయిలాగానే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. మంచి కామెడీ టైమింగ్, లవ్ సబ్జెక్ట్ లు తీసుకుంటే మాత్రం అదరగొట్టేస్తాడు.ఒకేసారి వరుసగా 12 ఫ్లాపులు వచ్చినా ధైర్యంగా ఎదురు నిలబడి, పోరాడి, మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి  హిట్ కొట్టి.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొత్త హీరోలకు మరియు సినిమా ఇండస్ట్రీకి రావాలన్న  తపన ఉన్న ఎంతోమందికి ఇన్స్పిరేషన్ హీరో నితిన్.  కేవలం సినిమాలో కాదు, ఆయన నిజ జీవితంలో కూడా హీరోనే. తాజాగా కరోనా వైరస్ పై పోరాటానికి ముందుగా స్పందించి అందరి కంటే ముందు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించి, తన గురువు పవన్ కళ్యాణ్ లాగా “గురువుకి తగిన శిష్యుడు” అనిపించుకున్న మంచి మనసున్న వ్యక్తి హీరో నితిన్. ఇక ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒకసారి ఆయన సినీ ప్రస్థానాన్ని గమనిస్తే…

నితిన్ ను సినిమా హీరోగా డైరెక్టర్ తేజ “జయం” సినిమాతో లాంచ్ చేశారు. ఆ సినిమాలో ఒక అమాయకుడైన పల్లెటూరి యువకుడు వెంకట్ పాత్రలో నితిన్ చాలా సహజంగా నటించాడు. “పట్టీలు వేసుకోండి.. చాలా బాగుంటారు.!” అంటూ చాలా న్యాచురల్ గా సదా తో నటించాడు నితిన్. ఆ తర్వాత డైరెక్టర్ వి.వి.వినాయక్ “దిల్” సినిమాతో నితిన్ ఇమేజ్ ను ఆకాశానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ సినిమాలో “జీవితంలో ప్రేమతో,యూత్ తో అస్సలు పెట్టుకోవద్దు” అంటూ ఈతరం కుర్రకారు మనసులో ఉన్న  మాటలను డి.టి.ఎస్ ఎఫెక్ట్ లో చెప్పాడు.

ఆ తర్వాత దశరథ్ గారి దర్శకత్వంలో వచ్చిన “సంబరం” సినిమా విజయం సాధించలేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తీసిన “శ్రీ ఆంజనేయం” సినిమాలో అంజి గా అద్భుతమైన నటన ప్రదర్శించాడు హీరో నితిన్. ఈ సినిమా నుంచే తన సొంత డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. అప్పటివరకు ఆయనకు హీరో శివాజీ డబ్బింగ్ చెప్పేవారు. “శ్రీ ఆంజనేయం” సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కమర్షియల్ హిట్ కాలేదు. ఇక హీరోల ఇమేజ్ ను ఆకాశం కన్నా ఇంకా ఎత్తుకు తీసుకెళ్లి పెట్టె డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన “సై” సినిమా లో రగ్బీ ప్లేయర్ గా నితిన్ చెలరేగిపోయాడు. “200 మంది కొట్టుకుంటే దొమ్మి కేసు అయితే.. రెండు వేల మంది కొట్టుకుంటే ఏమవుతుంది రా..!” అంటూ… నితిన్ చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.

తర్వాత ఈ రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన “అల్లరి బుల్లోడు” సినిమాలో ఆయన మార్క్ మ్యాజిక్ రిపీట్ కాలేదు. సినిమా ఫ్లాప్ అయ్యింది. మాస్, హీరోయిజం, లార్జర్ లైఫ్ క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్న నితిన్ సినిమాలు అన్ని ఘోరంగా పరాజయం పాలయ్యాయి. తేజ గారి దర్శకత్వంలో వచ్చిన “ధైర్యం” సినిమా దగ్గర నుంచి మొదలుపెట్టి “రామ్”, కొరియోగ్రాఫర్ అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన టక్కరి,ఆటాడిస్తా,విక్టరీ,  హీరో, ద్రోణ, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన “అడవి”, రెచ్చిపో, సీతారామ కళ్యాణం లంకలో, మారో… ఇట్లా సినిమా సినిమాకి నితిన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.

2012 సంవత్సరం నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి విక్రమ్ కుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన “ఇష్క్” సినిమా సూపర్ హిట్ అయి నితిన్ కి మళ్లీ పూర్వ వైభవం తీసుకు వచ్చింది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆ తర్వాత వెంటనే “గుండెజారి గల్లంతయిందే”, “హార్ట్ ఎటాక్”, “చిన్నదాన నీకోసం” సినిమాలు హ్యాట్రిక్ హిట్ అందించాయి. గౌతమ్ వాసుదేవ మీనన్ శిష్యుడు ప్రేమ్ సాయి దర్శకత్వం వహించిన “కొరియర్ బాయ్ కళ్యాణ్” సినిమా సబ్జెక్ట్ పరంగా బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు. 2016లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన “అ..ఆ” సినిమా మళ్లీ సూపర్ హిట్ అయ్యి నితిన్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు తెలియచేసింది.

కానీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన “లై”, కృష్ణ చైతన్య గారి దర్శకత్వంలో వచ్చిన “చల్ మోహనరంగా”, దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన “శ్రీనివాస కళ్యాణం” సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఈ దశలో మళ్లీ ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన “భీష్మ” సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం నితిన్ “రంగ్ దే” అనే సినిమాతో పాటు భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో క్రియేటివ్ జీనియస్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కూడా ఒక సినిమా కమిట్ అయ్యారు. ఇక తాజాగా ఒక ఇంటి వాడు కూడా కాబోతున్నారు.

నితిన్ గారి సినీ ప్రస్థానం ఒకసారి మనం గమనించినట్లైతే ఆయన హిట్లు వచ్చినప్పుడు పొంగిపోలేదు. ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోలేదు. తనపని చేసుకుంటూ వెళ్లారు. నితిన్ గారు భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేసి అభిమానులకు ప్రేక్షకులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.