హీరోయిన్ల కోసం బాలయ్య ఎదురుచూపులు


హీరోయిన్ల కోసం బాలయ్య ఎదురుచూపులు
హీరోయిన్ల కోసం బాలయ్య ఎదురుచూపులు

సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోయిన్లు దొరకడం అనేది ఈరోజుల్లో చాలా కష్టమైపోతోంది. యువ హీరోయిన్లు ఎవరూ సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఆసక్తి చూపించకపోవడం, ఉన్న నలుగురైదురు సీనియర్ హీరోయిన్లను పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళు భారీగా పారితోషికం డిమాండ్ చేస్తుండడంతో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయాలంటే దర్శక నిర్మాతలకు తల ప్రాణం తోకకి వస్తోంది. పోనీ ఆ భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆ సీనియర్ హీరోయిన్లని పెట్టుకుందామనుకున్నా రెండు సినిమాలు చేసేటప్పటికీ రొటీన్ అయిపోతోంది. దీంతో ఏం చేయాలో ఫిల్మ్ మేకర్స్ కు అంతు చిక్కకుండా ఉంది. చిరంజీవి వంటి మెగాస్టార్ కు కూడా ఈ తలనొప్పి ఉందంటే పరిస్థితి ఎలా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. చిరంజీవి 152వ చిత్రానికి ముహూర్తం జరిగి చాలా రోజులైనా కూడా ఇప్పటికీ హీరోయిన్ ఫైనల్ కాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. త్వరలో షూటింగ్ కు వెళదామని ప్లాన్ చేసుకుంటే హీరోయిన్ ఎంపిక కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది.

ఇక నందమూరి బాలకృష్ణ పరిస్థితి ఇలానే ఉంది. ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం రూలర్ కోసం స్టార్ హీరోయిన్ల కోసం ఎదురుచూసి చివరకు అసలు ఫామ్ లో లేని సోనాల్ చౌహన్ ను, ఎవరికీ గుర్తేలేని వేదికను తెచ్చి హీరోయిన్లుగా పెట్టి సినిమా చేస్తున్నారు. బాలయ్య తర్వాతి చిత్రానికి కూడా ఇదే సమస్య వెంటాడుతోంది. అవును, రూలర్ తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుతో చిత్రం చేయడానికి అంగీకరించిన సంగతి తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే సింహా, లెజండ్ వంటి చిత్రాలొచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో చిత్రానికి విపరీతమైన బజ్ ఉండాలి. కానీ దానికి భిన్నంగా ఈ చిత్రంపై పెద్దగా అంచనాల్లేవు. బాలకృష్ణ గత చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ దారుణమైన పరాజయాలను చవిచూడటం దీనికి ప్రధాన కారణం. అందులోనూ బోయపాటి సినిమాలన్నీ ఒకే రకమైన మూస ధోరణిలో ఉంటాయన్న భావన ప్రేక్షకులలో బాగా వచ్చేసింది. అంతేకాకుండా బోయపాటిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ అతని ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న బాలకృష్ణ – బోయపాటి చిత్రం త్వరలో షూటింగ్ కు వెళుతుంది. అయితే ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్లు ఫైనల్ కాలేదు. నందమూరి హీరో గత చిత్రాల మాదిరిగానే ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే ఇప్పటిదాకా ఒక్క హీరోయిన్ కూడా సెట్ అవ్వలేదు. నయనతార ఇప్పుడు బాగా కాస్ట్లీ అయిపోయింది. త్రిష తెలుగులో ఫెడౌట్ అయిపోయింది. శ్రియతో రీసెంట్ గానే బాలయ్య రెండు సినిమాలు చేసాడు. దీంతో మళ్ళీ వేరే హీరోయిన్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. కన్నడ హీరోయిన్ రచిత రామ్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని రచిత ఇటీవలే ప్రకటించింది. తననెవరూ సంప్రదించలేదని పేర్కొంది. అటు బోయపాటి వర్గం కూడా హీరోయిన్ గా అనుకున్నామే కానీ సంప్రదించలేదని ధృవీకరించింది. ఈ పరిణామాల బట్టి బాలయ్య హీరోయిన్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నట్లే.