మహేష్ సినిమాలో కూడా హైలైట్ అవ్వనున్న అనిల్ రావిపూడి ఊతపదం


మహేష్ సినిమాలో కూడా హైలైట్ అవ్వనున్న అనిల్ రావిపూడి ఊతపదం
మహేష్ సినిమాలో కూడా హైలైట్ అవ్వనున్న అనిల్ రావిపూడి ఊతపదం

ప్రతీ దర్శకుడికి ఒక్కో మార్క్ ఉంటుంది. అది ఎలా వచ్చినా ప్రతి సినిమాలోనూ దాన్ని ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు ఆయా దర్శకులు. రాఘవేంద్ర రావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పూలు, పళ్ళు విసరడం లాంటివన్నమాట. కొరటాల శివ సినిమాల్లో హీరో మంచితనం, పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో రౌడీయిజం ఈ కోవలోకే వస్తాయి. అలాగే అనిల్ రావిపూడి సినిమాల్లో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ఊతపదం.

అనిల్ రావిపూడి దర్శకుడిగా చేసినవి నాలుగు సినిమాలు. నాలుగు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. అయితే ఈ నాలుగు చిత్రాలూ కూడా కామెడీ ఎంటర్టైనెర్స్. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వీటిల్లో కామెడీ హైలైట్ గా నిలిచింది. అయితే వాటిని మించి ఆకట్టుకున్న మరో అంశం ఊతపదం. పటాస్ సినిమాలో పార్థాయ కానీ, సుప్రీమ్ సినిమాలో జింగ్ జింగ్ అమేజింగ్ కానీ, రాజా ది గ్రేట్ చిత్రంలో ఇట్స్ లాఫింగ్ టైమ్ కానీ, ఎఫ్ 2 లో అంతేగా అంతేగా కానీ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తున్నాయి.

ఇప్పటివరకూ కామెడీ ఎంటర్టైనెర్స్ మాత్రమే చేసిన అనిల్ రావిపూడి తొలిసారి బడా హీరోతో చేస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో యాక్షన్ ను కూడా జోడించాడు అనిల్. అలా అని చెప్పి తన స్ట్రాంగ్ జోనర్ అయిన కామెడీని మాత్రం విడిచిపెట్టలేదు. ఇందులో కూడా హిలేరియస్ కామెడీ  ఎపిసోడ్స్ చాలాపెట్టాడట. ముఖ్యంగా తన గత చిత్రాల్లోలాగే ఇందులో కూడా ఊతపదాన్ని వాడాడట.

అయితే అది ఏంటనేది మాత్రం సీక్రెట్ గానే ఉంచారు. సినిమా ట్రైలర్ లో దీన్ని రివీల్ చేయనున్నారు. ఎఫ్ 2 కి కూడా ఇలానే టీజర్, ట్రైలర్ లో అంతేగా అంతేగా అన్న ఊతపదాన్ని రివీల్ చేసారు. అది ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయిపోయింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ ఒక కామెడీ రోల్ చేస్తున్నాడు. తన చేత ఈ ఊతపదం చెప్పిస్తున్నాడట అనిల్ రావిపూడి. దీంతో బండ్ల గణేష్ బాగా హైలైట్ అవ్వడం ఖాయం.

ఎంటర్టైన్మెంట్ విషయంలో అనిల్ రావిపూడి లెక్క ఎప్పుడూ తప్పలేదు. మరి ఈ చిత్రంతో జనాలను సక్సెస్ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయశాంతి చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. జనవరి 12న సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.