`హృద‌య‌కాలేయం` టీమ్ నుంచి మ‌రో వెరైటీ!`హృద‌య‌కాలేయం` టీమ్ నుంచి మ‌రో వెరైటీ!
`హృద‌య‌కాలేయం` టీమ్ నుంచి మ‌రో వెరైటీ!

`సైలెంట్‌గా వ‌చ్చిన `హృద‌య‌కాలేయం` సంపూర్ణేష్ బాబుని హీరోని చేసింది. స్ఫూఫ్ కామెడీతో ఆక‌ట్టుకున్న ఈ చిత్ర టైటిల్ పోస్ట‌ర్ స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళిని కూడా ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత `కొబ్బ‌రిమ‌ట్ట` చిత్రంతో అల‌రించిన ఈ టీమ తాజాగా మ‌రో వెరైటీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. `క‌ల‌ర్ ఫోటో` పేరుతో రాబోతున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌జిలి, డియ‌ర్ కామ్రేడ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి హిట్ చిత్రాల్లో హీరోల స్నేహితుడిగా న‌టించి స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నసుహాస్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కామెడియ‌న్‌గా, హీరోగా ఆక‌ట్టుకున్న సునీల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చాందిని చౌద‌రి హీరోయిన్‌. యూట్యూబ్ వీడియోల‌తో పాపుల‌ర్ అయిన సందీప్ రాజ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కీర‌వాణి త‌న‌యుడు కాళ‌భైర‌వ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

1995 కాలంలో ఓ ఇంజినీరింగ్ కాలేజ్ నేప‌థ్యంలో సాగే వెరైటీ ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమా కూడా వెరైటీగా వుండే అవ‌కాశం వుందని తెలుస్తోంది. `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో రీసెంట్‌గా హిట్‌ని సొంతం చేసుకున్న హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్, `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా, `ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌` ఫేమ్ స్వ‌రూప్‌ ఈ చిత్ర ప్రారంభోత్స‌వంలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు అంద‌జేశారు.

Credit: Twitter