చైతూ సినిమాకు అంత భారీ బడ్జెట్ అవసరమా?


Huge budget for Naga Chaitanya and Parasuram movie
Huge budget for Naga Chaitanya and Parasuram movie

అక్కినేని నాగ చైతన్య ఫామ్ ప్రస్తుతం బాగుంది. రీసెంట్ గా కొన్ని ప్లాప్స్ ఉన్నా కానీ మజిలీ బ్లాక్ బస్టర్ తో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ప్రస్తుతం నాగ చైతన్య అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంది ఇండస్ట్రీ. నిర్మాణ సంస్థలు కూడా నాగ చైతన్యతో సినిమా అంటే ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది నాగ చైతన్య రెమ్యునరేషన్ పరంగా ఇంకా భారీ డిమాండ్లు చెయ్యట్లేదు. ఇంకా 5 – 7 కోట్ల రేంజ్ లోనే ఉన్నాడు. సినిమాను బట్టి పారితోషికం పెంచడం, తగ్గించడం చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో చేసే సినిమాకు 6 కోట్లు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తవ్వగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కు సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలన్న టార్గెట్ ను పెట్టుకున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య ఎలా ఉండబోతున్నాడో రీసెంట్ గా ఒక చిన్న వీడియో ద్వారా చూపించాడు.

శేఖర్ కమ్ముల హీరోల తరహాలోనే అతను మారిపోయాడన్న సంగతి ఇట్టే అర్ధమైపోతుంది. చాలా సింపుల్ గా, హాయిగా నవ్వుతూ కనిపించాడు చైతన్య. ఈ సినిమా ఉగాదికి విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య తన తర్వాతి చిత్రాన్ని కూడా సెట్ చేసుకున్నాడు. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరశురామ్ అలియాస్ బుజ్జి నాగ చైతన్యతో ఒక సినిమాను చేయబోతున్నాడు. గీత గోవిందం అంత పెద్ద హిట్ అయ్యాక నిజానికి పరశురామ్ స్టార్ హీరోలతో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కాలం గడిపేశాడు. దాదాపు సంవత్సరం స్టార్ హీరోల చుట్టూ తిరిగేసాడు. అయితే అవకాశం మాత్రం రాలేదు. వారందరూ బిజీగా ఉన్నది ఒక కారణమైతే పరశురామ్ ను ఇంకా స్టార్ డైరెక్టర్ గా గుర్తించకపోవడం మరొక కారణం. ఈ నేపథ్యంలో పరశురామ్ నాగ చైతన్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది.

సాధారణంగా నాగ చైతన్య సినిమాలు 25 నుండి 30 కోట్ల రేంజ్ లో పూర్తయిపోతాయి. అందుకే సినిమా ప్లాప్ అయినా చైతూతో పెద్ద రిస్క్ ఉండదు. కానీ పరశురామ్ సినిమాకు ఏకంగా 35 కోట్ల బడ్జెట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పరశురామ్ అత్యధికంగా 8 కోట్లు ప్లస్ లాభాల్లో వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య కూడా 7 కోట్ల దాకా పుచ్చుకుంటున్నాడు. హీరోయిన్ గా రష్మికను ఎంచుకోవాలని భావిస్తున్నారు. అప్పుడు ఆమెకు కోటికి పైన చెల్లించుకోవాలి. ఇక మిగతా కాస్ట్ అండ్ క్రూ, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ కలిపి చూసుకుంటే ఈజీగా 35 కోట్లు అవుతుంది. అయితే ఇంత పెద్ద మొత్తం 14 రీల్స్ పరశురామ్ ను చూసే పెడుతున్నారని తెలుస్తోంది. పరశురామ్ సినిమాలంటే మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం రిస్క్ తప్పట్లేదు.