ఇండియన్ 2 సెట్స్ లో దుర్ఘటన – ముగ్గురి మృతి

ఇండియన్ 2 సెట్స్ లో దుర్ఘటన - ముగ్గురి మృతి
ఇండియన్ 2 సెట్స్ లో దుర్ఘటన – ముగ్గురి మృతి

విశ్వనాయకుడు కమల్ హాసన్ – అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సెట్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన వల్ల ముగ్గురు చనిపోగా పలువురు గాయపడడం బాధాకరమైన విషయం. వివరాల్లోకి వెళితే ఇండియన్ 2 షూటింగ్ చెన్నై శివార్లలో ఒక సెట్ లో జరుగుతోంది. చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశంలో ఒక పెద్ద క్రేన్ కిందపడడంతో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. మృతుల్లో మధు(29), చంద్రన్ (60).. వీరిద్దరూ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కాగా సాహాయ దర్శకుడు కృష్ణ (34) కూడా ఉన్నారు. మృతదేహాలను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతే కాకుండా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య 10 కి చేరుకున్నట్లు సమాచారం.

చిత్ర దర్శకుడు శంకర్ కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు ఆయన కాలికి ఫ్రాక్చర్ అయిందని అన్నారు కానీ తర్వాత అది అంతా రూమర్ అని శంకర్ అక్కడే ఉన్నా అదృష్టవశాత్తూ ఆయనకు ఏం కాలేదని అంటున్నారు. షూటింగ్ సమయంలో కమల్ హాసన్ కూడా అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు. సవిత మెడికల్ కళాశాలలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ దురదృష్ట సంఘటన ఇండియన్ 2 టీమ్ లో తీవ్ర ద్రిగ్భ్రాంతిని నింపింది.

ఇండియన్ 2 లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంఘటన గురించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.