పారితోషికాలతో బెదరగొడుతున్న హీరోలు, దర్శకులు


పారితోషికాలతో బెదరగొడుతున్న హీరోలు, దర్శకులు
పారితోషికాలతో బెదరగొడుతున్న హీరోలు, దర్శకులు

సినిమా ఇండస్ట్రీ అనేది ఎన్ని మాట్లాడుకున్నా ఒక బిజినెస్. ఒక నిర్మాత అనేవాడు ముందుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎందుకు తీస్తాడు? సినిమా అనేది అందరికీ ప్యాషనే కావొచ్చు. కానీ ప్యాషన్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఆ నిర్మాతకు లాభాలు లేకపోయినా కేవలం ప్యాషన్ తోనే సినిమాలు నిర్మిస్తూ వెళ్ళిపోతాడా? ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. కేవలం నిర్మాత ఒక్కడే లాభపడినా కూడా లాభం లేదు. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా తెలీకుండా కేవలం హీరో, హీరోయిన్, దర్శకుడు, ట్రైలర్ వంటివి చూసి ఆ సినిమాను నమ్మి డబ్బు పెట్టే డిస్ట్రిబ్యూటర్ కూడా లాభపడాలి. అతని నుండి ఎగ్జిబిటర్ కూడా లాభాలు చూడాలి. ఈ మోడల్ అంతా సక్రమంగా జరిగితేనే తర్వాతి సినిమాకు డబ్బు ధైర్యంగా పెట్టగలడు నిర్మాతైనా, డిస్ట్రిబ్యూటరైనా, ఎగ్జిబిటరైనా!

ఇదివరకు సినిమా బిసినెస్ మోడల్ వేరుగా ఉండేది. అప్పట్లో నిర్మాత చేతిలో మేకింగ్ అంతా ఉండేది. నిర్మాత, దర్శకుడు కలిసి సినిమా ఎలా ఉండాలో నిర్ణయించేవారు. హీరో కేవలం వారు చెప్పేది విని నడుచుకునేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ పెద్ద హీరోలైనా కూడా వారు నిర్మాతలు, దర్శకులు పట్ల వినమ్రంగా నడుచుకునేవారు. అందుకే అప్పట్లో సినిమా మేకింగ్ అదుపులో ఉండేది. తన సినిమాకు ఎంత పెట్టాలో నిర్ణయించుకునే అధికారం నిర్మాత చేతుల్లో ఉంది కాబట్టి రిస్క్ తక్కువగా ఉండేది. సినిమా ప్లాప్ అయినా భారీ నష్టాలు అయితే వచ్చేవి కావు.

అయితే ఇప్పుడు సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేకింగ్ అంతా నిర్మాత చేతుల్లోంచి జారిపోయింది. హీరో, దర్శకుడు ఒక్కటైపోయారు. పారితోషికాలే సగం బడ్జెట్ ను ఆక్రమించేస్తున్న పరిస్థితి. అందులో కేవలం హీరో, దర్శకుడి పారితోషికమే దాదాపు మూడు వంతులు ఉంటుంటే ఇక నిర్మాత ఎలా సేఫ్ అయ్యేది. బడ్జెట్ పెరుగుతుండడంతో బిజినెస్ ను కూడా పెంచుతున్నారు. పెద్ద సినిమాల విషయంలో నిర్మాత సేఫ్ అవుతున్నా బయ్యర్లు నిండా మునిగిపోతున్నారు. ఒకవేళ సినిమా బాగున్నా వచ్చే లాభాలు ముందు నష్టపోయిన వాటిని పూడ్చుకోవడంతోనే సరిపోతుంది.

ఉదాహరణకు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలనే తీసుకుంటే.. అయిన బడ్జెట్ లో సగం మహేష్ బాబు-అనిల్ రావిపూడి, అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లకే అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనిల్ రావిపూడికి దాదాపు 10 కోట్ల మేర పారితోషికం ఇస్తున్నారట. ఇక మహేష్ గురించి చెప్పేదేముంది. సరిలేరు నీకెవ్వరులో పార్ట్నర్ కాబట్టి పారితోషికం కింద నాన్ థియేట్రికల్ హక్కులు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

అల వైకుంఠపురములో విషయానికి వస్తే అల్లు అర్జున్ సొంత  సంస్థ గీతా ఆర్ట్స్ ఇందులో నిర్మాణ భాగస్వామి. అయినా కూడా అల్లు అర్జున్ ఈ సినిమాకు 25 కోట్ల దాకా ముట్టినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎప్పట్లానే 20 కోట్లు వచ్చాయట. ఇలా 45 కోట్ల దాకా ఇద్దరి పారితోషికాలకే వెళ్లిపోతుంటే, మిగతా వారి పరిస్థితి ఏంటి, సినిమాను ఎంతలో తీయాలి. ఆ హీరో, దర్శకుడికి ఉన్న క్రేజ్ ను బట్టి నిర్మాత కూడా డబ్బులు పెడుతున్నాడు కానీ లాస్ వస్తే జేబులు గుల్లవుతున్నాయి.