అందుకు సిగ్గుప‌డుతున్నాను: క‌మ‌ల్‌హాస‌న్‌

అందుకు సిగ్గుప‌డుతున్నాను: క‌మ‌ల్‌హాస‌న్‌
అందుకు సిగ్గుప‌డుతున్నాను: క‌మ‌ల్‌హాస‌న్‌

`ఇండియ‌న్ -2` షూటింగ్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ అగర్వాల్‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన క్రేన్ ప‌డిపోవ‌డంతో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌డం కోలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిలో క‌ల‌క‌లంగా మారింది. ఈ ప్ర‌మాదం నుంచి క‌మ‌ల్‌హాసన్‌, కాజ‌ల్ అగ్వాల్ తృటిలో త‌ప్పించుకున్నార‌ని తెలిసింది.

అయితే ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కృష్ణ‌, ప్రొడ‌క్ష‌న్ అసిస్టెంట్ మ‌ధు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చంద్రన్‌ల కుటుంబాల‌పై హీరో క‌మ‌ల్‌హాస‌న్ త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు. మృతుల కుటుంబాల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని తాను పూడ్చ‌లేన‌ని, అయితే వారి కుటుంబాలు భ‌విష్య‌త్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందుల‌కు గురికాకూడద‌నే వారికి కోటి రూపాయ‌లు త‌న తరుపున అందించ‌నున్నాన‌ని వెల్ల‌డించారు.

ఈ సంఘ‌ట‌న సినిమా ఇండ‌స్ట్రీలో వ‌ర్క్ చేసే వారికి ర‌క్ష‌ణ అన్న‌ది ఇప్ప‌టికీ ఓ ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌రోసారి భ‌విష్య‌త్తులో పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై వుంది. కోట్ల బ‌డ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తున్నా ఆ సినిమా కొసం అశ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న వారి కోసం మాత్రం ఎలాంటి ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోతున్నందుకు నేను వ్య‌క్తిగ‌తంగా సిగ్గుప‌డుతున్నాను` అని క‌మ‌ల్‌హాస‌న్ భావోద్వేగానికి లోన‌య్యారు.