ఇద్దరి లోకం ఒకటే రివ్యూ


Iddari Lokam Okate Review in Telugu
Iddari Lokam Okate Review in Telugu

మూవీ రివ్యూ: ఇద్దరి లోకం ఒకటే
నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే, నాజర్, రోహిణి తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: శిరీష్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: జీఆర్ కృష్ణ
రేటింగ్: 2/5

రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమైంది. తన గత ఆరు సినిమాలు ప్లాపులే. దిల్ రాజుతో ఇంతకు ముందు చేసిన లవర్ పెద్ద డిజాస్టర్. ఈ నేపథ్యంలో దిల్ రాజు మళ్ళీ రాజ్ తరుణ్ తో సినిమా అంటే ఇందులో ఏదో విశేషముందనే అనుకున్నారంతా. ప్రోమోలతో, ట్రైలర్ తో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయిన ఇద్దరి లోకం ఒకటే ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:
ఒక టర్కీ సినిమా ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దారు. వర్ష (షాలిని పాండే) సినిమాల్లో కథానాయికగా రాణించాలని కలలు కనే అమ్మాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆమెకు అవకాశాలు మాత్రం రావు. ఈ నేపథ్యంలో వర్షకు మహి (రాజ్ తరుణ్) పరిచయమవుతాడు. స్వతహాగా ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన మహి వల్ల వర్ష హీరోయిన్ అవుతుంది. కట్ చేస్తే వీళ్లిద్దరికీ చిన్నప్పుడే పరిచయం ఉందని తెలుస్తోంది. చిన్నప్పుడే మంచి స్నేహితులైన వీరు మళ్ళీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అయితే తమ ప్రయాణం ఎటువైపు దారి తీసింది? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా? మహికి చిన్నప్పటి నుండి ఉన్న సమస్య ఏంటి? దానివల్ల ఎటువంటి పర్యవసానాలు ఎదురవుతాయి అన్నది చిత్ర కథ.

నటీనటులు:
రాజ్ తరుణ్ ముందు సినిమాలలో చాలా చలాకీగా, మాస్ ప్రధానంగా ఉంటాడు. అయితే ఈ చిత్రంలో మాత్రం చాలా కామ్ గా సటిల్ రోల్ చేసాడు. అయితే కొన్ని సందర్భాల్లో మరీ ఎక్కువ సటిల్ నెస్ చూపించాడేమో అనిపిస్తుంది. షాలిని పాండే మాత్రం ఆకట్టుకుంటుంది. ఆమె ఎంత మంచి నటి అన్నది అర్జున్ రెడ్డి లోనే చూసాం. ఇందులో ఆమెకు సంథింగ్ స్పెషల్ అనిపించదగ్గ పాత్ర దక్కింది. నాజర్, రోహిణి తదితరులు ఉన్నది కాసేపే అయినా మెప్పిస్తారు. భరత్ పాత్రకు ప్రాధాన్యమేమ్ లేదు. హీరో, హీరోయిన్లకు చిన్న పిల్లల పాత్రల వేసిన వారి నటన ఆకట్టుకుంటుంది.

సాంకేతిక అంశాలు:
కథగా చూసుకుంటే ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. ఇంతకుముందు మనం చాలా సార్లు చూసిందే. కథ పాతదే అయినా కథనం ఆసక్తికరంగా ఉంటే ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు కానీ ఈ సినిమాలో అదే కరువైంది. కథనం ఎక్కడా పరుగులు పెట్టదు. నత్తనడకన నడుస్తుంది. పోనీ ప్రేమకథకు అవసరమైన ఫీల్ అయినా ఉందా అంటే అది కూడా ఉండదు. దర్శకుడిగా కూడా జీఆర్ కృష్ణ అక్కడక్కడ తప్పితే పెద్దగా మెరుపులు ఏం లేవు. మిక్కీ జె మేయర్ సంగీతం మెప్పిస్తుంది. పాటలు ఆకట్టుకుంటాయి. వాటిని చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. లొకేషన్స్ అదిరిపోయాయి. ఊటీ అందాల్ని బాగా చూపించారు. నిర్మాణ విలువులకు ఢోకా లేదు.

విశ్లేషణ:
ఈ చిత్రాన్ని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. చివరి 10 నిముషాలు చాలా ఎమోషనల్ గా వర్కౌట్ అయింది. అయితే ఈ 10 నిముషాల తతంగానికి మిగతా సినిమా అంతా బోరింగ్ గా ఎందుకు నడిపించారో అర్ధం కాదు. సినిమాలో ఫీల్ ఉండదు, రొమాంటిక్ యాంగిల్ అసలే లేదు, ఎమోషనల్ గా వర్కౌట్ అయ్యే అంశాలు తక్కువే. కథల ఎంపికపై మంచి పట్టు ఉండే దిల్ రాజు ఎందుకని ఈ చిత్రం విషయంలో తప్పటడుగు వేశాడో అర్ధం కాదు. మొత్తంగా చూసుకుంటే ఇద్దరి లోకం ఒకటే ఏ మాత్రం ఆసక్తి కలిగించని ఒక ఫీల్ లెస్ లవ్ స్టోరీ. చైల్డ్ హుడ్ సీన్స్, పాటలు, క్లైమాక్స్, హీరోయిన్ పెర్ఫార్మన్స్ తప్పితే ఇద్దరి లోకం ఒకటేలో చెప్పుకోదగ్గ పాజిటివ్ పాయింట్స్ లేవు.

చివరిగా: ఇద్దరి లోకం ఒకటే- ఏ మాత్రం ఎమోషన్ లేని ఒక ప్రేమ కథ


REVIEW OVERVIEW
ఇద్దరి లోకం ఒకటే
SHARE