ఇండియన్ 2 అసలు ముందుకు కదులుతుందా?Indian 2 shooting in dilemma
Indian 2 shooting in dilemma

ఈ మధ్య కాలంలోనే కాదు, బహుశా ఏ సినిమాకూ రానన్ని కష్టాలు శంకర్ తీయదలిచిన ఇండియన్ 2 చిత్రానికి ఎదురవుతున్నాయి. ఏ ముహూర్తాన ఈ సినిమా తీద్దామని భావించాడో కానీ అప్పటినుండి ఈ సినిమా కష్టాల కడలిని ఈదుతోంది. ముందుగా ఈ చిత్రానికి బడ్జెట్ సమస్యలు తలెత్తాయి. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిద్దామనుకున్నాడు కానీ అంత బడ్జెట్ ను హ్యాండిల్ చేయలేమని మొదట్లోనే చేతులెత్తేశాడు. చివరికి శంకర్ తనతో 2.0 తీసి నష్టపోయిన లైకా సంస్థనే ఒప్పించి సినిమాను పట్టాలెక్కించాడు. అయితే కమల్ కు మేకప్ సెట్ కాక ఒకసారి, బడ్జెట్ సమస్యల వల్ల మరోసారి, కమల్ పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల మూడోసారి షూటింగ్ కు బ్రేక్స్ పడుతూనే ఉంది. అయితే శంకర్ ఈ ఇబ్బందులన్నీ దాటుకుని సినిమాను మళ్ళీ ఎలాగోలా పట్టాలెక్కించాడు. షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తుండగా సెట్ లో క్రేన్ మీదపడి ముగ్గురు చనిపోవడం సినిమాకు పెద్ద కుదుపుగా మారింది.

ఈ భారీ ప్రమాదం నుండి చిత్ర యూనిట్ ఇప్పుడిప్పుడే కోలుకునేలా లేరు. ముందుగా ఈ బాధను దిగమింగుకుని మార్చ్ రెండో వారం నుండి షూటింగ్ కు వెళదామని అనుకున్నారు కానీ అదేమీ జరిగేలా కనిపించట్లేదు. దానికి తోడు ఇప్పుడు ఈ చిత్రానికి లీగల్ సమస్యలు కూడా తోడయ్యాయి. లైకా సంస్థ సరైన భద్రతా చర్యలు తీసుకుంటే ఈ విధంగా జరిగేది కాదని కమల్ వ్యాఖ్యానించడంతో పోలీసులు లైకా సంస్థతో పాటు శంకర్, కమల్ లను కూడా విచారించారు.

దీంతో కమల్ కు ప్రొడక్షన్ హౌస్ కు మధ్య దూరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో కమల్ ను లైకాను కలిపి మళ్ళీ సినిమాను ట్రాక్ మీదకు తీసుకురావడం అంటే శంకర్ కు తలకు మించిన పనే. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఆర్టిస్ట్ ల డేట్ లు వృధా అయ్యాయి. దానికి తోడు వచ్చే ఏడాది కమల్ పొలిటికల్ కమిట్మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 అసలు ముందుకు కదులుతుందా అన్నది అనుమానంగా మారింది.