శబరిమల వివాదంలో శాశ్వత పరిష్కారం ఎప్పుడు.?


శబరిమల వివాదంలో శాశ్వత పరిష్కారం ఎప్పుడు.?

  • శబరిమల విషయంలో సుప్రీం కోర్టు ఎందుకు ఇంకా స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు .?
  • అయోధ్య కేసు విషయాన్నీ తేల్చి, ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు ఎందుకు శబరిమల వివాదానికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేదు .?
  • శబరిమలతో పాటు ఇస్లాం, పార్సీ మతాలలో ఉన్న స్త్రీల ఆంక్షల ప్రస్తావన ఎందుకు ఇక్కడ జోడించారు.?
  • ఒక వ్యక్తి అయినా, ఒక వ్యవస్థ అయినా చట్టాలను గౌరవించాలా.? లేదా ఆచార వ్యవహారాలను గౌరవించాలా.?
  • దేశంలో ఇన్ని ఆలయాలు ఉండగా, కేవలం కొన్ని ప్రత్యేక ఆచార వ్యవహారాలు పాటించే కొన్ని ఆలయాలపై జరుగుతున్న సాంస్కృతిక కుట్రగా ప్రస్తుత వివాదాన్ని భావించవచ్చా.?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే చివరివరకు చదవండి.

దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది ఈ ఆలయానికి వస్తుంటారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుని దీక్షా కాలం పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్రకు వెళ్తుంటారు.

అయ్యప్పను దర్శించుకునేందుకు చేసే శబరిమల ప్రయాణం కొంచెం కఠినంగా ఉంటుంది. అనేక మంది అయ్యప్ప దీక్ష చేసే భక్తులు వనయాత్ర ద్వారా శబరిమల ఆలయానికి చేరుకుంటారు. ఈ సుదీర్ఘ యాత్రలో భక్తులు కఠిన ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటిస్తారు. చాలా దూరం కాలినడకనే వెళ్తారు. 41 రోజుల పాటు చేసే అయ్యప్ప దీక్షలో భక్తులు ఇంకా ఎన్నో నియమాలు, ఆచారాలు అనుసరిస్తారు.

ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే భక్తులు 18 పవిత్ర మెట్ల మీది నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అత్యంత నిష్ఠతో 41 రోజుల పాటు ఉపవాసం చేయకుండా ఆ 18 మెట్లను దాటలేరని భక్తుల నమ్మకం. మందిరంలోకి ప్రవేశించేముందు భక్తులు కొన్ని కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీక్షా సమయంలో అయ్యప్ప భక్తులు నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి., అన్ని రోజులూ గడ్డం చేసుకోకూడదు. అనగా భౌతికమైన అందానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. రోజూ ఉదయాన్నే చన్నీటితో స్నానం చేసి, పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.

రుతుస్రావం కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై కొన్ని శతాబ్దాలుగా నిషేధం ఉంది. లింగసమానత్వానికి అది విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

ఆలయంలోకి మహిళలందరూ వెళ్లి పూజలు చేసేలా అనుమతిస్తూ 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

కేవలం రుతుస్రావం కారణాలతోనే మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని రాజ్యాంగ ధర్మాసనం 2018 సెప్టెంబర్ 28న తన తీర్పులో తెలిపింది. వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసేలా ఆచారాలు, సంప్రదాయాలు తప్పక అనుమతించాలని కోర్టు ఆదేశించింది.

ఆ తీర్పును మరోసారి సమీక్షించాలంటూ దాదాపు 60 దాకా పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే అయ్యప్ప స్వామిని ‘శాశ్వత బ్రహ్మచారి’గా ప్రకటించినప్పటికీ, అయ్యప్ప ఆలయంలో ప్రార్థన చేసేటప్పుడు స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి వివక్ష ఉండరాదని, 2018 సెప్టెంబర్ 28న వెల్లడించిన తీర్పు ఉత్తర్వులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు కేరళలో భారీ నిరసనలకు దారితీసింది. ఆలయంలో ప్రార్థన చేసేందుకు పోలీసు రక్షణతో కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలను నిరసనకారులు అడ్డుకున్నారు. కొందరి మీద భౌతిక దాడులు చేశారు. బిందు యామిని, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు జనవరి 2న సన్నిధానం వరకూ వెళ్లి ఆలయంలోకి వెళ్లగలిగారు.

శబరిమల ఆలయంలోకి మహిళల అందర్నీ అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా మొత్తం 65 పిటిషన్లు వచ్చాయి. ఇందులో 58 రివ్యూ పిటిషన్ లు, మరో నాలుగు రిట్ పిటిషన్లు, 5 ట్రాన్స్ ఫర్ పిటిషన్లు ఉన్నాయి

ఈ పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఫిబ్రవరి 6న తన తీర్పును రిజర్వు చేసింది. కానీ ఇప్పటి వరకు హిందూ మతానికి పరిమితమైన మహిళల ఆలయ ప్రవేశ వివాదం ప్రస్తుతం అన్ని మతాలకు అతీతంగా ప్రధాన మందిరాలలో ప్రవేశించే మహిళలకు ఒక హక్కుగా తేల్చవలసిన కేసు గా మారింది

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం తో పాటు, అన్ని రకాల మతాలలో ఉన్న మహిళలకు వారి ప్రార్థనా స్థలాలలో ప్రవేశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మొత్తం దాఖలైన పిటిషన్లు అన్నింటిని, విస్త్రత ధర్మాసనానికి బదిలీ చేయడానికి గల కారణాలను ఇలా వివరించారు.

అవి ఏమిటంటే నచ్చిన మతాన్ని ఆచరించడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు కావచ్చు, కానీ దేశ వ్యాప్తంగా దర్గాలు, మసీదులలో కూడా ముస్లిం మహిళల ప్రవేశంపై అంశాలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీ మతానికి చెందిన మహిళలు అన్య మతస్థుడు వివాహం చేసుకుంటే వారిని ఆ మతంలోకి కొనసాగకుండా ఆంక్షలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేవలం హిందూ మతానికి సంబంధించి కాకుండా సంపూర్ణంగా మహిళలందరికీ ఒక సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం జరగాల్సి ఉందని, అంతేకాకుండా, భవిష్యత్ లో ఇలాంటి వివాదాలు మళ్లీ తలెత్తకుండా ఉండాలని జస్టిస్ పేర్కొన్నారు. విస్తృత ధర్మాసనం ముందు చీఫ్ జస్టిస్ మించిన అంశాలు ఏమిటంటే

1. మత స్వేచ్ఛ కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న 25 26 అధికరణాల పరిమితి మరియు పరస్పర ప్రభావం ఎంత
2. రాజ్యాంగ నైతికత అనే పదానికి స్పష్టమైన నిర్వచనం మతపరమైన ఆచారాలలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిధి ఎంత
3. ఆర్టికల్ 25 లో పేర్కొన్న “సెక్షన్ ఆఫ్ హిందూ” అనే పదం పై స్పష్టమైన వివరణ
4. కొన్ని మతాల యొక్క ఆచారాలు మరియు కొన్ని వర్గాలకు ఆర్టికల్ 26 ప్రత్యేకంగా ఏమైనా రక్షణ కల్పిస్తోందా
5. మతాల ఆచార వ్యవహారాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం న్యాయస్థానాలు ఏ మేరకు పరిగణలోకి తీసుకోవాలి
6. అందులోనూ ఎ మతం పై అయినా, సంబంధిత మతాన్ని పాటించని వ్యక్తులు వేసే కేసులు స్వీకరించవచ్చా.

ఆలయప్రవేశం పై ఆంక్షలు మరియు దానికి సంబంధించిన వివాదాలు ఒక శబరిమల కే పరిమితం కాలేదు. గతంలో మహారాష్ట్రలో ఉన్న శని సింగనాపూర్ లో కూడా మహిళలకు ప్రవేశం లేకపోవడం కూడా వివాదం జరిగింది. అనేక సంవత్సరాల పాటు కొంతమంది శని సింగనాపూర్ ఆలయంలోకి మహిళల అనుమతించాలని ఉద్యమించారు. అప్పుడు ఆలయ నిర్వాహకులు ఒక కమిటీ సమావేశం నిర్వహించుకొని మహిళలను కూడా అనుమతిస్తూ వారి యొక్క నియమాలను సడలించుకున్నారు.

భారతదేశంలో దాదాపు 20 లక్షలకు పైగా దేవాలయాలు ఉంటే వాటిలో కొన్ని చోట్ల మాత్రమే ఇటువంటి ఆచార పరమైన ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలను అనుమతించాలని ఉద్యమం చేస్తున్న వారిలో హేతువాదులు ఉన్నారు. అదేవిధంగా అయ్యప్పస్వామి భక్తులమని చెప్పుకొనే వాళ్ళు ఉన్నారు.

ప్రస్తుతం బదిలీ చేయబడిన ఏడుగురు సభ్యులు గల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం మరి ఈ సమస్యని పరిష్కరించడానికి ఎంత వ్యవధి తీసుకుంటుందో చెప్పలేం. ధర్మాసనం ముందు ఉన్నటువంటి ఏడు అంశాలు భారతదేశంలో ఆచరించబడుతున్న మూడు ప్రధాన మతాలలో ఉన్న వివాదాస్పదమైన అంశాలు.

ఏది ఏమైనప్పటికీ, భారతదేశంలో ఈ నాటికి కూడా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఆ ప్రభుత్వం యొక్క విధానాలు, పాలసీలు లేదంటే ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి, అవినీతి ఇలాంటి ప్రాతిపదికన కాకుండా ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకువచ్చి అధికార ప్రతిపక్ష పార్టీలు సాగిస్తున్న ఈ రాజకీయ క్రీడ ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు.

Interesting & Unknown Facts About Shabarimala
Interesting & Unknown Facts About Shabarimala