వెంకీ మామ రిస్క్ చేస్తున్నాడా?


Is releasing Venky Mama for sankranthi correct decision
Is releasing Venky Mama for sankranthi correct decision

ఇప్పటికే నాలుగు చిత్రాలు సంక్రాంతి రిలీజ్ కి షెడ్యూల్ అయి ఉన్నాయి. ఎంత పండగ సీజన్ అయినా కూడా ఈ నాలుగు చిత్రాలకి థియేటర్లు సర్దడమే పెద్ద తలనొప్పి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఇలా ఎవరికివారు థియేటర్ల విషయంలో తర్జనభర్జనలు పడతారు. నలుగురికే సర్దడం కష్టమనుకుంటే వెంకీ మామ మధ్యలో వచ్చి సడెన్ గా దూరేసాడు. జనవరి 14న ఈ చిత్రం విడుదలవుతోంది.

అసలు మొదట దసరాకి షెడ్యూల్ అయి ఉన్న సినిమాను పొంగల్ దాకా ఎందుకు వెనక్కి తోస్తున్నట్లు? వెంకటేష్ 2019 సంక్రాంతికి ఎఫ్2 తో భీభత్సమైన హిట్ కొట్టాడు. ఈ సినిమాలో వరుణ్ ఉన్నా కానీ మేజర్ సక్సెస్ క్రెడిట్ వెంకీకే వెళ్ళింది. తనవల్లే ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. అప్పుడు విడుదలైన కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాల ప్లాపులు కూడా ఎఫ్2 కు కలిసొచ్చాయి.

అయితే ఈసారి మంచి చిత్రాలు బరిలో దిగుతున్నాయి. ఎఫ్2 తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడే మహేష్ తో సంక్రాంతికి వస్తున్నాడు. ఎప్పుడోకానీ గురి తప్పని గురూజీ, సక్సెస్ రేషియో ఎక్కువ ఉన్న బన్నీతో వస్తున్నాడు. ఫీల్ గుడ్ మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ వస్తున్నాడు. ఇక రజిని గురించి చెప్పేదేముంది. ఇలా అన్నీ మంచి అంచనాలు ఉన్న చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఎంత హిట్ టాక్ వచ్చినా కూడా వెంకీ మామ పెద్దగా వెనకేసుకునేది ఏముంటుంది?