మ‌ళ్లీ విజ‌య్‌నే ఎందుకు టార్గెట్ చేశారు?

మ‌ళ్లీ విజ‌య్‌నే ఎందుకు టార్గెట్ చేశారు?
మ‌ళ్లీ విజ‌య్‌నే ఎందుకు టార్గెట్ చేశారు?

త‌మిళ హీరో విజ‌య్‌ని కావాల‌నే టార్గెట్ చేస్తున్నారా?. అందు కోస‌మే అత‌ని ఇంటిపై ప‌దే ప‌దే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారా? అని త‌మిళ వ‌ర్గాలు అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. గ‌త నెల‌లో హీరో విజ‌య్ త‌న తాజా చిత్రం `మాస్ట‌ర్‌` చిత్రీక‌ర‌ణ‌ నెయిల్ వెలీలో జ‌రుగుతుండ‌గా లొకేష‌న్‌కి వ‌చ్చిన ఐటీ అధికారులు విజ‌య్‌ని ఇంటికి తీసుకెళ్లి మరీ సోదాలు నిర్వ‌హించ‌డం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఈ సంఘ‌ట‌న‌పై ఆగ్ర‌హించిన విజ‌య్ అభిమానులు వంద‌ల సంఖ్య‌లో విజ‌య్ ఇంటికి చేర‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. విజ‌య్ చెప్ప‌డంతో శాంతించిన అభిమానులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌మ హీరో సినిమాలు వున్నాయి కాబ‌ట్టే బీజేపీ శ్రేణులు టార్గెట్ చేస్తున్నాయ‌ని. అందులో భాగంగానే ఐటీ రైడ్‌లంటూ నానా హంగామా చేస్తున్నార‌ని విజ‌య్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈ సంఘ‌ట‌న మ‌ర్చిపోక‌ముందే మ‌రోసారి విజ‌య్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

`బిగిల్‌` సినిమాకు సంబంధించిన ప‌న్ను ఎగ‌వేశార‌ని ఆల‌రోపణ‌లు రావ‌డంతో ఐటీ అధికారులు ఆ చిత్ర నిర్మాత‌, కార్యాయ‌లం, ఇళ్ల‌తో పాటు ఫైనాన్షియ‌ర్ అన్బుచెలియ‌న్ ఇల్లు కార్యాల‌యాల‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. తాజాగా చెన్నై ప‌ణ‌యూర్ ప‌ల్లంలోని హీరో విజ‌య్ నివాసానికి వెళ్లి మ‌రోసారి సోదాలు నిర్వ‌హిస్తున్నారు. దీంతో విజ‌య్ అభిమానుల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియ‌ని ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయిని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.