పొంచివుంది క‌రోనా.. జాగో ఇండియా జాగో!


పొంచివుంది క‌రోనా.. జాగో ఇండియా జాగో!
పొంచివుంది క‌రోనా.. జాగో ఇండియా జాగో!

ప్ర‌పంచం ఎన్న‌డూ చూడ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. దేశం ఎన్న‌డూ ఊహించ‌ని లాక్ డౌన్‌కి పూనుకుంది. ఎప్పుడూ జ‌న సందోహంతో కిట‌కిట‌లాడిన‌ రోడ్ల‌న్నీభ‌యంక‌ర‌మైన నిశ్శ‌బ్దంలోకి జారుకున్నాయి. ఆ నిశ్శ‌బ్దం వాటిని కూడా వెక్కిరిస్తోంది. కానీ ఇది అనివార్యం.. ఉన్న‌ట్టుండి మ‌నం ఏ టైమ్‌మెషీన్‌లోకి ఏమైనా ఎంట‌ర‌య్యామా?  లేక మ‌న‌ల్నే అంత‌రిక్ష‌వాసులు టైమ్ మెషిన్‌లోకి నెట్టేశారా?… అని స‌గ‌టు మ‌నిషిని ద‌హిస్తున్న అనుమానం… ఏ ప‌రిస్థితుల్లో వున్నాం?.. ఎక్క‌డో ఎవ‌డో ఏదో తిన్నాడ‌ని కొన్ని వేల మైళ్ల దూరంలో వున్న మ‌నం చేతులు క‌డుక్కోవ‌డం ఏంటి?  విన‌డానికి విడ్డూరంగా వుంది క‌దూ..

ఒక‌ప్పుడు మా వాడు విదేశాల్లో వున్నాడ‌ని, విదేశాల‌కు వెళ్లాల‌ని.. అదే స్టేట‌స్ సింబ‌ల్‌గా భావించి కాల‌ర్ ఎగ‌రేసేవారు… ఇప్పుడు మాత్రం ప‌లానా వాడు విదేశాల్లో వున్నాడు.. ఇండియా వ‌స్తున్నాడు. అంటే ఓ పురుగుని చూసిన‌ట్టు చూసే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇండియా వ‌స్తున్నాడంటే వాడి వెంట వైర‌స్‌ని తీసుకొచ్చాడ‌ని ప్ర‌త్యేకంగా, అంట‌రాని వారిగా చూస్తున్నాం. మిగ‌తా వాళ్ల‌ని అంటుకోరాద‌ని దూరం పెడుతున్నాం. వీలైతే ఊరి బయ‌ట అంటే క్వారెంటైన్‌ల‌లో వుండాల‌ని బ‌ల‌వంతం చేస్తున్నాం. అలా వుండ‌ని వారిని చూసి భ‌యంతో వ‌ణికిపోతున్నాం.

ఇది ఎన్నాళ్లు?.. ఈ ప‌రిస్థితి అర్థం చేసుకునే లోపు ఏం జ‌రుగుతోంది? ఏం జ‌ర‌గ‌బోతోంది అని కోటి ప్ర‌శ్న‌లు మ‌న మ‌స్థిష్కాన్ని తొలిచేస్తున్నాయి. ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఒక్క‌టే మార్గం ఇంటికే ప‌రిమితం కావ‌డం. ఇదే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. అయినా నా కేంటి? న‌న్నేదీ అంటు కోదు ముట్టుకోదు.. అంత ధైర్యం దేనికీ లేద‌నే అజ్ఞానంతో జ‌నం ఇప్ప‌టికీ హ‌ద్దులు దాటుతూనే వున్నారు. కానీ ప్ర‌భుత్వాలు మాత్రం జాగ్ర‌త్త‌గా వుండండి.. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకోవాలంటే చేతులు క‌డుక్కోండి.. చేతులు క‌డుక్కోండి.. అని ప్ర‌చారం చేస్తున్నాయి. అంటే మాన‌వాళి చేతులు క‌డిగేసుకునే స‌మ‌యం వ‌చ్చేసిందా? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

ఏది వ‌చ్చిందో ఎలా వ‌చ్చిందో తెలుసుకునే లోపే జ‌ర‌గాల్సిన దారుణం జ‌రిగిపోయింది. కాలం మ‌న‌ల్ని ఊహించ‌ని ప‌రిస్థితుల్లోకి నెట్టేసింది. ఇప్ప‌టికైనా మ‌న‌మంతా జాగ్రత్తతో ఉండకపోతే భారీ స్థాయిలో ఇండియా మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి అందుకే జాగో ఇండియా జాగో.. నీ ముందున్న ముప్పుని తెలుసుకుని దాని నుండి ఎలా బ‌య‌ట‌ప‌డాలో ఆలోచించండి. ఇదే అంద‌రికీ మంచిది.