ప్రభాస్ స్పూర్తిగా శ్రమిస్తున్న జయం రవి


ప్రభాస్ స్పూర్తిగా శ్రమిస్తున్న జయం రవి
ప్రభాస్ స్పూర్తిగా శ్రమిస్తున్న జయం రవి

ప్రభాస్ గురించి చెప్పాలంటే, బాహుబలి సినిమాకి ముందు; బాహుబలి సినిమాకు తర్వాత అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా ఎంత రికార్డులు క్రియేట్ చేసినా, ఒక స్టార్ హీరో ఒక ప్రాజెక్ట్ కోసం 5 ఏళ్ళు మరొక సినిమా ఒప్పుకోకుండా పూర్తి సమయం ఆ సినిమాకే కేటాయించడం కమర్షియల్ లెక్కల ప్రకారం చూస్తే పెద్ద రిస్క్ అని చెప్పాలి. కానీ, ప్రభాస్ బాహుబలి కథను, దర్శకుడు రాజమౌళి విజన్ ని అంతగా నమ్మాడు. సినిమా షూటింగ్ సమయంలో అనుష్క, తమన్నా, రానా లాంటి ఇతర నటీ నటులు వేరే సినిమాలు చేసుకుంటూ ఉన్నా, ప్రభాస్ మాత్రం అక్షరాలా 5 ఏళ్ళు ఆ సినిమా కోసమే ఒక రకమైన తపస్సు చేసాడు. దాని ఫలితం కూడా అదే స్థాయిలో వచ్చింది.

ఇప్పుడు దర్శక దిగ్గజం మణిరత్నం గారు తీస్తున్న “పొన్నియన్ సెల్వన్” సినిమా కోసం హీరో జయం రవి కూడా పూర్తి సమయం ఆ సినిమాకే కేటాయిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ రోల్ అయిన “ఆరుల్మోజి వర్మన్” పాత్ర కోసం ఇప్పటికే కసరత్తులు చేస్తూ ఉండగా, జుట్టు మొత్తం తీసేసి గుండు చేయించుకున్నాడు. చోళ సామ్రాజ్యాన్ని భారత దేశం దాటి తూర్పు ఆసియా దేశాలకు సైతం విస్తరించిన చోళ చక్రవర్తి ఆరుల్మోజి వర్మన్ గా జయం రవి ఇందులో కనిపిస్తాడు. ఇక ఈ భారీ చిత్రంలో చియాన్ విక్రం, కార్తీ, నయనతార, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వంటి నటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు మాతృక తమిళ అగ్ర రచయిత శ్రీ కల్కి కృష్ణమూర్తి రచించిన 2400 పేజీల సుదీర్ఘ గ్రంధం “పోన్నియన్ సెల్వన్”. ఇంత భారీ స్థాయి కథను మణిరత్నం రెండు భాగాలుగా తీస్తారని ప్రస్తుత సమాచారం. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ప్రేఖకుల నుండి మంచి ఆదరణ వచ్చింది. చిత్ర యూనిట్ ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో ఒక భారీ షెడ్యుల్ చిత్రీకరణలో ఉంది. ఇక ఈ సినిమా గనుక సూపర్ హిట్ అయితే జయం రవి క్రేజ్,మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతాయి.