`క‌బీర్‌సింగ్` మాంచి జోరుమీదున్నాడే!


Shahid Kapoor
Shahid Kapoor

తెలుగులో సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `అర్జున్‌ రెడ్డి`. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ సెన్సేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. తెలుగు సినిమా గ‌మ‌నాన్ని మార్చిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది. తెలుగులో టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌క్తిక‌ట్టించిన ఈ చిత్రాన్ని త‌మిళంలో హీరో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ తో `ఆదిత్య వ‌ర్మ` పేరుతో రీమేక్ చేశారు. అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఇదే చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. షాహీద్ క‌పూర్ హీరోగా సందీప్ వంగ రూపొందించిన ఈ  చిత్రం అక్క‌డ వ‌సూళ్ల సునామీని సృష్టించి దేశ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయింది.

హీరో షాహీద్ క‌పూర్‌కు స్టార్‌డ‌మ్‌ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ముందు షాహీద్ రెమ్యున‌రేష‌న్ కేవ‌లం 9 నుంచి 13 కోట్లు మాత్ర‌మే. కానీ `క‌బీర్‌సింగ్‌` ఆయ‌న కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించ‌డంతో షాహీద్‌క‌పూర్ త‌న పారితోషికాన్ని 40 కోట్ల‌కు పెంచేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ తెలుగు రీమేక్ ఇచ్చిన స‌క్సెస్ ఊపులో వున్న షాహీద్ క‌పూర్ తాజాగా మ‌రో రీమేక్‌కు సైన్ చేసిన విష‌యం తెలిసిందే. నాని న‌టించిన `జెర్సీ` చిత్రాన్ని షాహీద్ క‌పూర్‌తో రీమేక్ చేస్తున్నారు. అల్లు అర‌వింద్‌, అమ‌న్ గిల్‌, దిల్  రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు `జెర్సీ`కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి ఈ సినిమాతో బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో సెట్స్‌పైకి రాబోతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం ముంబైలో మొద‌లైంది. ఈ విష‌యాన్ని హీరో షాహీద్ క‌పూర్ సోష‌ల్ మీడియా ట్విట్ఱర్ ద్వారా ప్ర‌క‌టించారు. `గత రెండు వారాలుగా షూటింగ్ కి దూరంగా వున్నాను. ఈ రోజే `జెర్సీ` షూట్ మొద‌లైంది. షూటింగ్ అంటే కొంత నెర్వ‌స్‌గా వుంది. ప్ర‌తీ పాత్ర నాకు ఓ ఛాలెంజ్‌. దీని కోసం ఎన్నో నిద్ర‌లేని రాత్రుల్ని గ‌డుపుతాను. బాధ్య‌త‌గా నా వంతు ఎఫ‌ర్ట్‌ని పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తాను` అని షాహీద్ ట్వీట్ చేశారు. `సూప‌ర్ 30` ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించ‌నున్న ఈ సినిమాని వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 28న రిలీజ్ చేయాల‌ని ముగ్గురు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.