
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. ఈ యంగ్ హీరో ఏది చేసినా ఇప్పడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. దక్షిణాదితో పాటు ఈ హీరోగారి క్రేజ్ బాలీవుడ్‌ని కూడా తాకడంతో అక్కడ కూడా విజయ్ దేవరకోండ గురించి చర్చ జరుగుతోంది. విజయ్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని అక్కడి కథానాయికలు ఆసక్తిని చూపిస్తున్నారు. సినిమాలో అవకాశం చిక్కని వారు విజయ్ దేవరకొండతో కలిసి కమర్షియల్ యాడ్లలోనూ నటిస్తూ ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఫిబ్రవరిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్‌తో కలిసి విజయ్ దేవరకొండ `ఫైటర్` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా ద్వారా విజయ్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారట. ఇందు కోసం పూరి, చార్మి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌ని పార్ట్నర్గా వుండమని కోరినట్టు, ఆఫర్ నచ్చడంతో కరణ్ అంగీకరిచినట్టు ప్రచారం జరిగింది.
ఆయన కారణంగానే ఈ సినిమా కోసం అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ని కథానాయికగా పూరి ఒప్పించారన్నది మరో వార్త. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని వుందని జాన్వీ చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటని ఆమె ఈ సినిమాతో నిజం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను జాన్వీ 3.50 లక్షలు పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇదే నిజమైతే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇక లాంఛమే అని అర్థమవుతోంది. `ఫైటర్` చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.