చిరు అల్లుడి సినిమా కన్నడ వెళ్తోందే!Kalyan Dhevs super machi to be dubbed in Kannada
Kalyan Dhevs super machi to be dubbed in Kannada

సినిమా ఇండస్ట్రీలో వారసులు, వాళ్ళ పిల్లలు సినిమాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య అల్లుళ్ళు కూడా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మొదటగా ఈ కేటగిరీలో మనం మాట్లాడుకోవాల్సింది కృష్ణ అల్లుడు సుధీర్ బాబు గురించే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమైనా ఇంకా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నాడు సుధీర్ బాబు. అయితే ఇటీవలే సమ్మోహనం, నన్ను దోచుకుందువటే సినిమాలతో హిట్స్ మీద ఉన్న సుధీర్ బాబు తన కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో V చిత్రంలో నటిస్తోన్న సుధీర్ బాబు, తర్వాత బాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు.

ఇక రీసెంట్ గా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. కళ్యాణ్ దేవ్ నటించిన తొలి సినిమా విజేత, పరాజయం పొందింది. తొలి ప్రయత్నంలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు కళ్యాణ్ దేవ్. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం తన రెండో సినిమా చేస్తున్నాడు. పులి వాసు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమాలో కళ్యాణ్ దేవ్ నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ సూపర్ మచ్చి పదాన్నే కళ్యాణ్ దేవ్ తన సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం సూపర్ మచ్చి షూటింగ్ తుదిదశకు చేరుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా గురించిన ఒక తాజా అప్డేట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సూపర్ మచ్చిని కన్నడలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా రెండో సినిమా మాత్రమే చేస్తోన్న హీరో, తన సినిమాను వేరే భాషలోకి తీసుకెళుతుండడం అంటే అది రిస్క్ తో కూడిన వ్యవహారమే. మొదటి సినిమా కూడా ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు రెండో సినిమాను ఇలా భారీ లెవెల్లో విడుదల చేస్తుండడం డేరింగ్ మూవ్ అనే చెప్పాలి. కన్నడ వెర్షన్ కు మీనాక్షి అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. మరి ఏదొక మతలబు లేకుండా ఇలా కన్నడలో రిలీజ్ చేయాలనుకోరు కదా. పైగా మెగా హీరోలకు కన్నడలో మంచి మార్కెట్ ఉంది. మరి అది ఈ మెగా అల్లుడికి ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి.