లేడీ సింగర్ కరోనా కథ.. తీగ లాగితే డొంకంతా కదులుతోంది


లేడీ సింగర్ కరోనా కథ.. తీగ లాగితే డొంకంతా కదులుతోంది
లేడీ సింగర్ కరోనా కథ.. తీగ లాగితే డొంకంతా కదులుతోంది

ప్రస్తుతం ఏ నలుగురు ఒక చోట కూర్చున్నా కరోనా గురించే చర్చలు వస్తున్నాయి. కరోనా సృష్టిస్తోన్న భయం మాములుగా ఉండట్లేదు. అయితే అధికారులు ఎంతలా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇంకా కొంత మంది మూర్ఖత్వం వల్ల కానీ తమకు తెలియనితనం వల్ల కానీ చేస్తున్న పనులు అంతటా చర్చనీయాంశం అవుతున్నాయి. నిన్ననే బయటపడిన లేడీ సింగర్ కనికా కపూర్ కరోనా కథాంశం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. బేబీ డాల్ సాంగ్ తో ఫేమస్ అయిన కనికా కపూర్, కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న యూకే నుండి ఇండియా తిరిగి వచ్చింది. లక్నో విమానాశ్రయంలో దిగిన ఆమె అక్కడి అధికారులకు చిక్కితే ఎక్కడ తనను నిర్బంధంలో ఉంచుతారోనని వాష్ రూమ్ లో తప్పించుకుని రకరకాల ఇబ్బందులు పడి మొత్తానికి బయటపడింది. పోనీ బయటకు వచ్చిన ఆమె ఇంట్లో తనను తాను నిర్బంధించుకోకుండా సుబ్బరంగా బయట పార్టీలకు అటెండ్ అయింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.

అసలు , తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో పార్టీ ఎవరు ఇచ్చారో కానీ 100 మందికి పైగా హాజరైన ఒక పార్టీకి కనికా వెళ్ళింది. ఇక్కడితో కథ అయిపోలేదు. అదే పార్టీకి ఒక ఎంపీ కూడా హాజరయ్యాడు. ఆ ఎంపీ రాష్ట్రపతి భవన్ వెళ్ళాడు. అక్కడ రాష్ట్రపతితో పాటు అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్న అల్పాహార విందుకు హాజరయ్యాడు. అలాగే ఆ పార్టీకి వెళ్లిన కొందరు నేతలు రీసెంట్ గా యూపీ కాబినెట్ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ విషయాలు తెలిసిన అధికారులకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. రాష్ట్రపతితో పాటు మిగతా అత్యున్నత అధికారులను కూడా ఇప్పుడు నిర్బంధంలో 14 రోజుల పాటు ఉంచాల్సిన పరిస్థితి. ఇదే పెద్ద తలనొప్పి వ్యవహారం అంటుంటే కనికా కపూర్ తండ్రి ఆమె మొత్తం మూడు పార్టీలకు హాజరైందని చెబుతున్నాడు. ఆమె మాత్రం ఒకే పార్టీకు వెళ్లానని అంటోంది. ఇప్పుడు కనికా నివసిస్తున్న సొసైటీలో ఒక వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. యూకే నుండి తిరిగి వచ్చి కనికా ఇప్పుడు ఎంత మందికి కరోనా అంటించిందోనన్న ఊహే అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది.