హైద‌రాబాద్‌లో షూట్‌కు మ‌రో క‌న్న‌డ హీరో రెడీ!


హైద‌రాబాద్‌లో షూట్‌కు మ‌రో క‌న్న‌డ హీరో రెడీ!
హైద‌రాబాద్‌లో షూట్‌కు మ‌రో క‌న్న‌డ హీరో రెడీ!

తెలుగు సూప‌ర్‌స్టార్‌లు సినిమా షూటింగ్ లు చేయ‌డానికి వెన‌కాడుతున్న రోజులివి. క‌రోనా కార‌ణంగా ప‌రిస్థితి దారుణంగా మార‌డంతో షూటింగ్‌ల కోసం మ‌రి కొంత కాలం వేచి చూద్దామ‌ని ఆలోచిస్తున్నారు. కానీ క‌న్న‌డ స్టార్స్ మాత్రం మేము రెడీ అంటూ ముందుకొస్తున్నారు. ఇట‌వ‌ల హైద‌రాబాద్‌లో క‌న్న‌డ హీరో సుదీ‌ప్ త‌ను న‌టిస్తున్న `ఫాంట‌మ్‌` చిత్ర షూటింగ్‌ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో మొద‌లుపెట్టి షాకిచ్చిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ హీరో బాట‌లోనే మ‌రో క‌న్నడ స్టార్ హైద‌రాబాద్‌లో షూటింగ్‌కి సై అంటున్నాడు. ఆయ‌నే వెర్స‌టైల్ స్టార్‌ ఉపేంద్ర‌. క‌న్న‌డ‌లో హీరోగా న‌టిస్తూనే ఉపేంద్ర ఆ చిత్రాల్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల తెలుగు, క‌న్న‌డతో పాటు ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో `క‌బ్జా` చిత్రాన్ని చేస్తున్న ఉపేంద్ర తాజాగా తెలుగులో మ‌రో చిత్రాన్ని అంగీక‌రించినట్టు తెలిసింది.

వ‌రుణ్‌తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్ర‌పాటి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ అల్లు బాబీ ( అల్లు అర్జున్ సోద‌రుడు) ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ వైజాగ్‌లో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్‌ని నిలిపివేశారు. బాలీవుడ్ భామ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో హీరో ఉపేంద్ర న‌టించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన ఉపేంద్ర వ‌చ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నఈ చిత్రం కోసం హైద‌రాబాద్ రానున్న‌ట్టు తెలిసింది.