చిరు టైటిల్స్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన కార్తీ


చిరు టైటిల్స్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన కార్తీ
చిరు టైటిల్స్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన కార్తీ

కార్తీ మొదటి సినిమా నుండి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనదైన శైలిలో కెరీర్ నిర్మించుకుంటూ వస్తున్నాడు. మధ్యలో కెరీర్ కొంచెం డల్ అయినా కానీ రీసెంట్ గా ఖైదీ సినిమా సాధించిన సక్సెస్ తో మళ్ళీ రైట్ ట్రాక్ లో పడ్డాడు. తమిళ హీరోల్లో అతి తక్కువ కాలంలో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న కార్తీ, మధ్యలో తన ఇమేజ్ కు సూట్ కాని కథలను ఎంచుకుని ప్లాపులతో ఇబ్బంది పడ్డాడు. అయితే ఖైదీ మళ్ళీ కార్తీని తెలుగువారికి దగ్గర చేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఇక్కడ సినిమాను కున్న డిస్ట్రిబ్యూటర్లకు డబల్ ప్రాఫిట్లను చూపించింది. దీపావళికి ఖైదీని విడుదల చేసిన కార్తీ, మళ్ళీ డిసెంబర్ లోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జ్యోతిక, కార్తీ అక్కాతమ్ముళ్లుగా నటించిన దొంగ ఈ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దృశ్యం సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి కూడా దర్శకుడు. ట్రైలర్ తో ఈ సినిమా కూడా సరైన అంచనాలను అందుకుంది.

అయితే సరిగ్గా గమనిస్తే ఖైదీ, దొంగ రెండూ కూడా చిరంజీవి సినిమా టైటిల్స్ కావడం విశేషం. కార్తీ ఇలా వరసగా చిరంజీవి టైటిల్స్ ను తన సినిమాలకు వాడుకోవడంపై మెగా ఫ్యాన్స్ అప్పట్లో కొంత అసహనానికి గురయ్యారు కూడా. అయితే బేసిగ్గా కార్తీకి ఉన్న క్లీన్ ఇమేజ్ కారణంగా, చిరంజీవి గురించి గొప్పగా చెప్పడం, ఆయనపై తనకున్న అభిమానాన్ని చెప్పడం వల్ల వాళ్ళు కూడా కూల్ అయ్యారు. ఇక ఇప్పుడు దొంగ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న కార్తీ ఇలా చిరు సినిమా టైటిల్స్ వాడుకోవడంపై స్పందించాడు. “ఖైదీ సినిమాకు అదే పెర్ఫెక్ట్ టైటిల్. తమిళంలో కూడా అదే టైటిల్ ఉంటుంది. అయితే అది చిరంజీవి గారి సినిమా టైటిల్ అని తెలియగానే చాలా సంతోషమేసింది. సినిమా చూసిన ఎవరైనా ఇదే కరెక్ట్ టైటిల్ అని అనుకుంటారు, అలాగే జరిగింది కూడా. ఇక దొంగ సినిమాకి వస్తే ముందుగా తమ్ముడు అనే టైటిల్ అనుకున్నాం కానీ అది అందుబాటులో లేదు, అందుకే దొంగ అనే టైటిల్ నిర్ణయించాం. ఇలా నా సినిమాలు చిరంజీవి గారి సినిమా టైటిల్స్ కు సరిపోవడం భలే అనిపిస్తోంది. ఆయన సినిమా టైటిల్స్ నా కథలకు సరిపోవడం గర్వంగా, గౌరవంగా ఫీల్ అవుతున్నా” అని చెప్పాడు.

ఈ మాటలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే కదా మరి. ఖైదీతో తెలుగు ప్రేక్షకులని మళ్ళీ మెప్పించిన కార్తీ, దొంగగా ఏం చేస్తాడో, మరోసారి చిరంజీవి టైటిల్ తనకు లక్ తెస్తుందా అనేది చూడాలి.