జర్నలిస్ట్ లను నిలువునా ముంచిన కేసిఆర్


Kcr gives shock to journalists

తెలంగాణ జర్నలిస్ట్ లకు భూములు ఇస్తానని చెప్పి , పెద్ద పెద్ద అపార్ట్ మెంట్ లు కట్టిస్తానని చెప్పి నిలువునా మోసం చేసాడు ఉద్యమ నాయకుడు , తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . తెలంగాణ ఉద్యమంలో అగ్ర భాగాన నిలిచింది జర్నలిస్టులే అంటూ ఉద్యమ సమయంలో అలాగే రాష్ట్రం సిద్దించిన సమయంలో వేనోళ్ళ పొగిడిన కేసిఆర్ అండ్ కో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జర్నలిస్టుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించింది . ఎప్పటికప్పుడు దొంగ హామీలు ఇస్తూ తెలంగాణ జర్నలిస్టులను మాయలో పడేసాడు కేసిఆర్ . వరంగల్ వెళ్లి పెద్ద పెద్ద భవంతులు కట్టిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా శంఖుస్థాపనకు నేనే వస్తా సంవత్సరం లోనే ఆ కట్టడాలు పూర్తయ్యేలా చేస్తామని మాటిచ్చాడు . ఖమ్మం వెళ్లి అక్కడా హామీ ఇచ్చాడు . హైదరాబాద్ లో అయితే వంద కోట్లతో నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పడమే కాకుండా అద్భుతమైన జర్నలిస్ట్ కాలనీ కట్టిస్తామని ఒకసారి , భూములు ఇస్తామని మరోసారి చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నాలుగున్నర సంవత్సరాలు పూర్తిచేసి జర్నలిస్టుల ఆశలపై నీళ్ళు చల్లాడు కేసిఆర్ .

ఇదిగో ఇస్తున్నా ….. అదిగో ఇస్తున్నా అంటూ కాలయాపన చేస్తూ జర్నలిస్ట్ లను నిండా మోసం చేసాడు కేసిఆర్ . అయితే ఇంత జరిగినప్పటికీ జర్నలిస్టులు నోరు మెదపడం లేదు ఎందుకంటే ఎదిరిస్తే ఏమౌతుందో ? అన్న భయం నెలకొంది . ఉద్యమ సమయంలో సింహాల్లా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మిన్నకుండి పోయారు . మీడియా యాజమాన్యాలే అధికారానికి తలోగ్గినప్పుడు మేమెంత ? అనే భావన కొంతమందిలో ఉంటే …… ఓటు అనే ఆయుధం మా చేతిలో ఉంది కాబట్టి ఆ ఆయుధాన్నిసంధించి ప్రతీకారం తీర్చుకుంటాం అని భావించే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు . ఏది ఏమైనా మాట ఇస్తే తప్ప …….. తల అయినా నరుక్కుంట కానీ మాట తప్ప అన్న కేసిఆర్ జర్నలిస్ట్ లకు బోలెడు హామీలు ఇచ్చి ఆ హామీలను మాత్రం మర్చిపోయాడు .

English Title: Kcr gives shock to journalists