కార్తీ ఖైదీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్


కార్తీ ఖైదీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
కార్తీ ఖైదీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

తెలుగులో మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది తమిళ హీరోల్లో కార్తీ ఒకరు. కెరీర్ మొదట్లోనే కార్తీకి ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఆవారా వంటి సినిమాలతో కార్తీ తెలుగు వారికి బాగా చేరువయ్యాడు. తమిళంతో పాటే తెలుగులో కూడా కార్తీ సినిమాలు సమాంతరంగా విడుదలయ్యేవి. అంతేకాకుండా తమిళంతో సరిసమానంగా తెలుగులో కూడా కార్తీ సినిమాలు మార్కెట్ అయ్యేవి. చాలా త్వరగా తెలుగులో మంచి మార్కెట్ సంపాదించిన కార్తీ, అంతే త్వరగా దానిపై పట్టు కోల్పోయాడు. కథల ఎంపికలో చేసిన పొరబాట్ల వల్ల తెలుగులో పూర్తిగా డీలా పడ్డాడు.

ఖాకీ సినిమా ఇక్కడ బాగానే ఆడినా రీసెంట్ గా కార్తీ చేసిన దేవ్ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ దక్కలేదు. దీంతో తెలుగులో కార్తీ పనైపోయింది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఖైదీతో తన పనైపోలేదని నిరూపించుకునే పనిలో పడ్డాడు కార్తీ. ఈ చిత్రాన్ని తెలుగులో రాధామోహన్ పంపిణీ చేస్తున్నాడు. ఖైదీకి పోటీగా విజయ్ విజిల్ కూడా అదే రోజున విడుదలవుతోంది. టీజర్, ట్రైలర్ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో కార్తీ ఢిల్లీ అనే క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ లేదు, పాటలు లేవు. ఇక కథ విషయానికి వస్తే కేవలం నాలుగు గంటల్లో సాగే ఇంటెన్స్ కథగా ఖైదీ ఉండనుంది. పదేళ్ల తర్వాత జైలు నుండి విడుదలైన ఒక ఖైదీ తన కూతుర్ని కలుసుకోవడానికి వెళ్లే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే ఈ చిత్ర కథ.

చిరంజీవి టైటిల్ కావడంతో తెలుగులో ఈ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చింది. అయినా కానీ కార్తీ రీసెంట్ ట్రాక్ రికార్డ్ వల్ల ఈ చిత్రానికి బిజినెస్ తగ్గింది. దేవ్ సినిమా దారుణమైన నష్టాలను మిగల్చడంతో ఖైదీ చిత్రానికి భారీ రేట్లు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. మొత్తానికి ఖైదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 4.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అంటే చిత్రం 5 కోట్లు సాధించింది అంటే సినిమా లాభాల బాట పెట్టినట్లే. పోటీగా విజిల్ ఉన్నా పండగ సీజన్ కావడంతో టాక్ ఏ మాత్రం బాగున్నా 5 కోట్లు వసూలు చేయడం పెద్ద విషయమేం కాదు.

ఫాదర్ డాటర్ రిలేషన్ బేస్ పై లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హై ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయి. ఖైదీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్తీ అయితే ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. విజిల్ పోటీకి ఉన్నా ఏ మాత్రం కంగారు పడట్లేదు. పండగకి రెండు సినిమాలు విడుదలవ్వడం మంచిదే అంటున్నాడు. అలా అయితే ఏ చిత్రం బాగుంటే దానికి వెళతారని కార్తీ అభిప్రాయపడ్డాడు. మరి ఖైదీపై కార్తీ పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఎదురుచూడక తప్పదు.