మాస్ మహారాజా బర్త్ డే స్పెషల్: క్రాక్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్


Krack release date announced
Krack release date announced

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా డిస్కో రాజా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రాగా కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ చిత్రం సక్సెస్ స్టేటస్ గురించి తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు. ఇక ఈ సినిమా రిలీజ్ కాక ముందే రవితేజ తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. తను దర్శకుడిగా పరిచయం చేసిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇందులో మాస్ మహారాజా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత శృతి హాసన్ తెలుగులో నటిస్తోన్న చిత్రమిదే.

కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈరోజు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా క్రాక్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. క్రాక్ సమ్మర్ స్పెషల్ గా మే 8న విడుదల కానుంది. ఈ మధ్య సంక్రాంతికి ఈ సినిమాలో ఫ్యామిలీ ఫోటోను రిలీజ్ చేసారు. శృతి హాసన్ బైక్ నడుపుతుండగా, వెనకాల రవితేజ పిండి వంటలతో కలిగిన క్యాన్ లను పట్టుకుని కూర్చున్నాడు. ముందు వాళ్ళిద్దరి కొడుకు  కూర్చొన్న ఫొటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ కు రవితేజ పవర్ఫుల్ లుక్ ను రివీల్ చేసారు. రవితేజ పోలీస్ పాత్రల్లో నటించడం కొత్త కాకపోయినా ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ ను ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న క్రాక్ షూటింగ్ ఏప్రిల్ లో కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ చిత్రం తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు.