పవన్ జానపద చిత్రం.. కన్ఫర్మ్ అయినట్టేనా?


పవన్ జానపద చిత్రం.. కన్ఫర్మ్ అయినట్టేనా?
పవన్ జానపద చిత్రం.. కన్ఫర్మ్ అయినట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. మొదట్లో చేయనని తన ఫోకస్ మొత్తం రాజకీయాల మీదే ఉందని కొంచెం బెట్టు చేసినా, నిర్మాతల ఒత్తిడికి పవన్ కళ్యాణ్ తలొగ్గక తప్పలేదు. రీ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ చేసాడు కానీ ఎవరితో చేస్తున్నాడు, ఏ రకమైన సినిమా చేస్తున్నాడన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. కొన్ని రోజుల క్రితం ఒక అప్డేట్ వచ్చింది. దిల్ రాజు పవన్ రీ ఎంట్రీకి ఒప్పించాడని, పెద్ద కష్టం లేకుండా చేయడానికి, డ్యాన్సులు, ఫైట్లు లేకుండా ఉండేలా పింక్ రీమేక్ ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి మహా అయితే 25 రోజుల కాల్ షీట్స్ అవసరమవుతాయని, అటు రాజకీయాలను కూడా బ్యాలన్స్ చేస్తూనే హ్యాపీగా ఈ సినిమా చేసుకోవచ్చని దిల్ రాజు ప్రపోజల్ పెట్టాడట. అయితే ఈ విషయమ్మీద చూద్దాం అన్నట్టుగానే పవన్ స్పందించినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మరో కొత్త వార్త బయటకు వచ్చింది. పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం నిజమే కానీ అది దిల్ రాజు ప్రపోజ్ చేసిన పింక్ రీమేక్ తో కాదని, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వంలో సినిమాతో పవన్ తన రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఈ సినిమా కూడా ఆషామాషీగా ఉండదని, భారీ బడ్జెట్ లో జానపద జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక క్రిష్ పవన్ కు ఫుల్ నరేషన్ ఇస్తాడట. అది కనుక ఓకే అయితే ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసినట్లే. ఇప్పటివరకూ పవన్ జానపద జోనర్ ను టచ్ చేయలేదు. కాబట్టి ఇది చాలా సరికొత్త ప్రయత్నమని చెప్పాలి. అందులో ఈ కథ 100 ఏళ్ల క్రితం జరిగిన కథగా ఉంటుందిట. అంటే పీరియాడిక్ జానపద చిత్రమన్నమాట. మరి పవన్ కు ఇలాంటి ప్రాజెక్ట్ సెట్ అవుతుందా? అందులోనూ రీ ఎంట్రీ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు డిఫరెంట్ గా ఉంటాయి.

మరి క్రిష్ ఎలాంటి కథను పవన్ కోసం సెట్ చేస్తున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు. అన్నీ సజావుగా సాగితే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మొదట్లోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే పవన్ సులువుగా అయిపోయే పింక్ రీమేక్ ను కాదని క్రిష్ సబ్జెక్ట్ పై ఎందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాడన్నది అర్ధం కాని ప్రశ్న. అంటే క్రిష్ ఫస్ట్ నరేషన్ తో పవన్ ను ఇంప్రెస్ చేశాడా? ఏమో వారిద్దరికే తెలియాలి. పవన్ ఆఖరి చిత్రం అజ్ఞాతవాసి దారుణమైన పరాజయాన్ని పొందిన విషయం తెల్సిందే. మరోవైపు క్రిష్ కూడా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలతో డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకోగా, హిందీలో మణికర్ణిక విజయం సాధించినా దాని చుట్టూ ముసిరిన వివాదంతో క్రిష్ పేరు మసకబారిందనే చెప్పాలి. మరి ఈ ఇద్దరూ కలిసి చేయబోయే చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.