ఉప్పెన భామకు అవకాశాల వెల్లువ

Kriti Shetty bags two more films before debut release
Kriti Shetty bags two more films before debut release

మెగా హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి. అందులో భాగంగా రెండు పాటలను విడుదల చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలు విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నీ కళ్ళు నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ పాటలు శ్రోతలను అమితంగా ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడన్న భావన కలిగించాయి. ఈ రెండు పాటల్లో విజువల్స్ ను కూడా చూపించారు. అందులో వైష్ణవ్ తేజ్ కూడా బాగానే ఆకట్టుకున్నా కానీ హీరోయిన్ కృతి శెట్టి మాత్రం ప్రేక్షకులకు ఫేవరేట్ అయిపొయింది. ముఖ్యంగా ఆమె నవ్వు యువకులను కట్టిపడేస్తోంది. అందుకే తొలి సినిమా కూడా విడుదల కాకుండానే కృతి శెట్టికి ఫ్యాన్స్ పుట్టుకొచ్చేసారు.

ఎవరికైనా క్రేజ్ వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీ అస్సలు వదిలిపెట్టదు. అలాగే ఇప్పుడు కృతి శెట్టికు కూడా టాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ నడుస్తోంది. ఇంకా తొలి సినిమా కూడా విడుదల కాకుండానే కృతి శెట్టి మరో రెండు సినిమాలకు సైన్ చేయడం విశేషం. సుకుమార్ ఉప్పెన చిత్రానికి ఒక నిర్మాత కాగా, సుకుమార్ మరో సినిమాను కూడా కో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తన శిష్యుడు పల్నాటి సూర్య కుమార్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాకు ఇప్పుడు కృతి శెట్టిను తీసుకున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా ఇప్పటికే మీడియాకు ఈ న్యూస్ లీకైంది.

ఇది కాకుండా ఇప్పుడు కృతి శెట్టికి మరో సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా ఇటీవలే పాగల్ అనే సినిమా లాంచ్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే కృతి శెట్టి మరింత బిజీ హీరోయిన్ అవుతుంది అనడంలో సందేహం లేదు.