వ‌ద‌ల ‌బొమ్మాళీ వ‌ద‌లా.. అంటోందిగా!


వ‌ద‌ల ‌బొమ్మాళీ వ‌ద‌లా.. అంటోందిగా!
వ‌ద‌ల ‌బొమ్మాళీ వ‌ద‌లా.. అంటోందిగా!

మీరాచోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని వ‌ద‌ల బొమ్మాళీ వ‌ద‌లా అంటూ వివ‌శ్వ‌ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇటీవల మీరాచోప్రానుద్దేశించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొంత మంది ఆక‌తాయిలు వ‌ల్గ‌ర్‌గా కామెంట్‌లు చేసిన విష‌యం తెలిసిందే. చంపేస్తామ‌ని, గ్యాంగ్ రేప్ చేస్తామ‌ని, పోర్న్ స్టార్‌లా వున్నావ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆగ్ర‌హానికి గురైన మీరాచోప్రా స‌ద‌రు ఫ్యాన్స్‌పై, హీరో ఎన్టీఆర్‌పై విరుచుకుప‌డింది.

ఇలాంటి ఫ్యాన్స్‌తో ఎన్టీఆర్ ఎలా స్టార్‌గా ఎదిగాడ‌ని విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మొద‌లుపెట్టింది. మ‌హేష్ ఇష్ట‌మని, త‌న‌కు తెలియ‌ని ఎన్టీఆర్ ఎవ‌ర‌ని అడిగితే త‌న‌పై వ‌ల్గ‌ర్‌గా కామెంట్‌లు చేస్తున్నార‌ని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించింది. త‌న‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన కామెంట్ల స్క్రీన్ షాట్‌ని తెలంగాణ మంత్రి, తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, నిజామాబాద్ మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత‌కు ట్యాగ్ చేస్తూ త‌న‌పై జ‌రుగుతున్న దురాగ‌తాన్ని వెల్ల‌డించే ప్ర‌య‌త్నం చేసింది.

దీనికి మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా రిప్లై ఇచ్చారు. `మేడ‌మ్ నేను తెలంగాణ డీజీపీ, హైద‌రాబాద్ సీపీకి చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించాను` అని ట్వీట్ చేశారు. దీనికి ప్ర‌తిగా మీరాచోప్రా `మీరు స్పందించ‌డం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి చ‌ర్య‌లు మ‌హిళా ర‌క్ష‌ణ‌కు చాలా అవ‌స‌రం. ఇక‌పై ఇలాంటి వ్య‌క్తుల్ని మ‌హిళ‌ల‌పై నేరాలు చేయ‌కుండా స్వేచ్ఛ‌గా వద‌ల‌కూడ‌దు` అని స్పందించింది. మీరా వ్య‌వ‌హారం చూస్తుంటే ఈ విష‌యాన్ని ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేద‌ని టాలీవుడ్ జ‌నాలు అంటున్నారు.