క‌రోనాతో న‌టుడు వేణుగోపాల్ మృతి!


Leading actor venugopal is no more
Leading actor venugopal is no more

క‌రోనా మ‌హ‌మ్మారి టాలీవుడ్ న‌టుడిని క‌బ‌లించింది. ప్ర‌ముఖ సినీ, టీవీ న‌టుడు కోసూరి వేణుగోపాల్ క‌రోనా కార‌ణంగా బుధ‌వారం రాత్రి క‌న్నుమూశారు. గ‌త 23 రోజులుగా హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్న ఆయ‌న బుద‌వారం తుదిశ్వాస విడిచారు. క‌రోనాకు చికిత్స తీసుకున్నాక ఆయ‌న‌కు నెగెటివ్ వ‌చ్చినా బ్ర‌త‌క‌లేద‌ని కుటుంబం స‌భ్యులు తెలిపారు.

వేణుగోపాల్‌కు భార్య‌, కుమార్తె, కుమారుడు వున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురానికి చెందిన ఆయ‌న ఎఫ్‌సీఐలో మేనేజ‌ర్‌గా పని చేస్తూ ప‌ద‌వీవిర‌మ‌ణ చేశారు. దాదాపు 27 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో వున్న వేణుగోపాల్ ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. పీ.ఎన్‌. రామ‌చంద్రారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `తెగింపు` చిత్రంలో వేణుగోపాల్‌ న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `మ‌ర్యాద‌రామ‌న్న‌` ఆయ‌న‌కు న‌టుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

నాగ‌శౌర్య న‌టించిన `ఛ‌లో` చిత్రంలో ఆయ‌న వెన్నెల కిషోర్‌కి తండ్రిగా న‌టించి న‌వ్వులు పూయించారు. ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్రం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ రూపొందించిన `అమీతుమీ`. వేణుగోపాల్‌ ఆక‌స్మిక మృతికి వెన్నెల కిషోర్‌, హ‌రీష్ శంక‌ర్‌తో పాటు ప‌లువురు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.