`జ‌న గ‌ణ మ‌న‌` ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మే?


`జ‌న గ‌ణ మ‌న‌` ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మే?
`జ‌న గ‌ణ మ‌న‌` ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మే?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు, పూరి జ‌గ‌న్నాథ్‌ల‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్ అన‌డం కంటే ఇండ‌స్ట్రీ హిట్ కాంబినేష‌న్ అన‌డం బాగుంటుందేమో. వీరిద్ద‌రి తొలి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `పోకిరి` ఇండ‌స్ట్రీకి తెలుగు సినిమా స‌త్తా ఏంటో తొలిసారి రుచి చూపించింది. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన `బిజినెస్‌మెన్‌` హిట్ అనిపించుకుంది. ఆ త‌రువాత ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి ఈ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తుంద‌ని ఫ్యాన్స్‌, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఎదురుచూశాయి.

కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు. మ‌హేష్‌తో `జ‌న గ‌ణ మ‌న‌` చేయాల‌న్న‌ది పూరి ఆలోచ‌న‌. అయితే అప్ప‌ట్లో పూరి ఫ్లాపుల్లో వుండ‌టంతో మ‌హేష్ పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. ఇదే విష‌యాన్ని పూరిజ‌గ‌న్నాథ్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు కూడా. అయితే టైమ్ మారింది. ప్ర‌స్తుతం ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ మంచి వాతావ‌ర‌ణం ఎర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజున త‌న 27వ చిత్రాన్ని లాంఛ‌నంగా మొద‌లుపెట్టిన మ‌హేష్ ఇదే ఊపుతో ఫ్యాన్స్‌లో ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పూరితో సిన‌మాపై మ‌హేష్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. భ‌విష్య‌త్తులో పూరితో క‌లిసి ప‌నిచేస్తారా అని అడిగితే `క‌చ్చితంగా న‌టిస్తా. నాకు ఇష్ట‌మైన ద‌ర్శ‌కుల్లో పూరి ఒక‌రు. ఆయ‌న క‌థ చెబుతారేమో అని ఎదురుచూస్తున్నా` అన్నారు మ‌హేష్‌. అంటే రానున్న రోజుల్లో పూరి – మ‌హేష్‌ల క‌ల‌యిక‌లో `జ‌న గ‌ణ మ‌న‌` ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం గ్యారంటీ అని తెలుస్తోంది.