మెహర్ రమేష్ చేతికి మహేష్ సినిమా


mahesh babu help to meher ramesh with sarileru neekevvaru
mahesh babu help to meher ramesh with sarileru neekevvaru

ఎవరి పేరు చెబితే నిర్మాతల జేబులు గుల్లవుతాయని భయపడతారో, ఎవరి పేరు చెబితే హీరోలు తమ ఇమేజ్ టోటల్ డ్యామేజ్ అని కంగారు పడతారో, ఎవరి పేరు చెబితే ప్రేక్షకులు ఉలిక్కిపడి థియేటర్లు వైపు వెళ్లడం మానేస్తారో అతనే మెహర్ రమేష్. టైటిల్ చూసి కంగారు పడిపోకండి. మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంకా తన 27వ సినిమా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి మహేష్ సినిమా అతని చేతికి వెళ్లడమేంటని కంగారు పడిపోకండి. వివరాల్లోకి వెళితే..

మెహర్ రమేష్, పూరి జగన్నాథ్ స్కూల్ నుండి వచ్చాడు. రావడమే ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో అశ్వినీదత్ వంటి బడా ప్రొడ్యూసర్ తో కంత్రీ తీసాడు. ఆ సినిమా ఫలితమేంటో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చేసిన బిల్లా ఓ మోస్తరుగా ఆడినా అది రీమేక్ సినిమా కాబట్టి దాన్ని మెహర్ ఖాతాలో వేయలేం. ఇక 2011లో వచ్చిన శక్తి సినిమా అయితే ఎన్టీఆర్ అభిమానులకు పీడకలను మిగిల్చింది. కొన్నాళ్ల పాటు ఎన్టీఆర్ అభిమానులు బయట తలెత్తుకోని విధంగా సినిమా తీసి పెట్టాడు మెహర్. ఇంత పెద్ద ఆణిముత్యం ఇచ్చినా వెంకటేష్ షాడో చేసే అవకాశం ఇచ్చాడు. ఇక ఈ సినిమా దెబ్బతో మెహర్ రమేష్ షాడో కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. ఆరేళ్ళు అయినా కానీ మెహర్ కు మరో సినిమా చేసే అవకాశం ఎవ్వరూ ఇవ్వలేదు. మెహర్ కూడా అభిమానుల ప్రాణాల మీద జాలి కలిగి మరో సినిమా చేయాలని పూనుకోలేదు.

ముందు నుండి మహేష్ కు క్లోజ్ అయిన మెహర్ నెమ్మదిగా తన పిఆర్ పనులు చూసుకుంటూ మహేష్ దగ్గరే సెటిలైపోయాడు. ఇప్పటికీ మహేష్, మెహర్ కలిసి ఉన్న ఫోటోలు కనిపిస్తే మహేష్ అభిమానుల్లో ఒక్కసారిగా కంగారు మొదలవుతుంది. ఎక్కడ ఈ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందోనని. అయితే చాలా ఏళ్ల నుండి మహేష్ కు పిఆర్ గా ఉంటూ వస్తోన్న మెహర్ కు, ప్రిన్స్ ఒక హెల్ప్ చేసాడట. సరిలేరు నీకెవ్వరు చిత్ర గుంటూరు హక్కులను తన రికమండేషన్ తో మెహర్ కు ఇప్పించాడట. మహేష్ చెప్పాడు కాబట్టి రేటు విషయంలో పట్టుబట్టకుండా హక్కులను కట్టబెట్టేశారట. మరి ఈ విధంగానైనా మెహర్ డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో సెటిలైపోతాడేమో చూడాలి.

ఇక సరిలేరు నీకెవ్వరు విషయానికి వస్తే.. ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తైన విషయం తెల్సిందే. ఇక సాంగ్ షూట్ బ్యాలెన్స్ మాత్రం మిగిలుంది. ఇప్పటికే తమన్నాతో ఒక స్పెషల్ సాంగ్ ఉండగా, సరిలేరు టీమ్ మరో స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారట. త్వరలోనే దీన్ని కూడా షూట్ చేస్తారని తెలిసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సరిలేరు నీకెవ్వరులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.