సరిలేరు బొమ్మ దద్దరిల్లిపోద్ది: మహేష్


Mahesh Babu talks about Sarileru Neekevvaru and his future projects
Mahesh Babu talks about Sarileru Neekevvaru and his future projects

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మహేష్ బాబు అయితే ఈ చిత్రం మీద ఎనలేని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. శ్రీమంతుడు, మహర్షి సినిమాల ముందు కూడా మహేష్ లో ఇదే ఉత్సాహం కనిపించిందని, ఇప్పుడు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంతే కాంఫిడెన్స్ ను చూపిస్తున్నాడు కాబట్టి బొమ్మ బ్లాక్ బస్టర్ అని అభిమానులు అనుకుంటున్నారు. మహేష్ కూడా తక్కువేం తినలేదు. బొమ్మ దద్దరిల్లిపోద్దని చెప్పి ఒక్కసారిగా అంచనాలను పెంచేసాడు. నిన్న మీడియాతో ముచ్చటించిన మహేష్ పలు ఆసక్తికర విషయాలను గురించి స్పందించాడు.

సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయం మీద చాలా నమ్మకంతో ఉన్నట్లు చెప్పాడు మహేష్. డే 1 నుండి ఈ సినిమా బాగా ఆడుతుందనే నమ్మకమే కలిగించిందని, ఇప్పుడు కూడా అదే వైబ్ కంటిన్యూ అవుతోందని సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ముందే ఇలా అనిపిస్తుందని అంటున్నాడు. ఫస్ట్ కాపీ చూసాక నిర్మాతలు కూడా హ్యాపీగా ఫీలయ్యారని చెప్పాడు.

ఇక దర్శకుడు అనిల్ రావిపూడిపై ప్రశంసల జల్లు కురిపించాడు మహేష్. కొంచెం కూడా ఒత్తిడికి గురవ్వకుండా ఉండడం అనిల్ రావిపూడికే చెల్లిందని, ఎంత కష్టమైన విషయం వచ్చినా ఆయన సరదాగా డ్యాన్స్ చేస్తూ సెట్ ను ఆహ్లాదంగా ఉంచుతారని, సెట్ అలా ఉంటే అందరూ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చని తెలిపాడు మహేష్.

ఈ చిత్రంలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు చెప్పాడు సూపర్ స్టార్. కచ్చితంగా ఈ చిత్రం తన అభిమానులను 100 శాతం సంతృప్తి పరుస్తుందన్న నమ్మకముందని చెప్పాడు. నా పాత్ర సరికొత్త డైమెన్షన్ లో ఉంటుందని, అలాగే నా బాడీ లాంగ్వేజ్ కూడా విభిన్నంగా ఉంటుందని, అన్ని ఎమోషన్స్ కలగలిసిన పాత్ర కాబట్టి కచ్చితంగా అందరూ ఆదరిస్తారన్న నమ్మకముందని చెప్పాడు మహేష్.

చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు మహేష్. మొదటినుండి చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్. చాలా సందర్భాల్లో ఆయన్ను చూసి ఇన్స్పైర్ అయ్యా. అలాగే ఆయన కూడా మొదటి నుండి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. నా ఒక్కడు, పోకిరి వంటి సినిమాలు చూసి పర్సనల్ గా కలిసి అభినందించారు. నా గత చిత్రాలు కొన్నిటికి ఆయన నుండే అభినందిస్తూ మొదటి కాల్ వచ్చింది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి కూడా మొదటి కాల్ ఆయన నుండే వస్తుందని అనుకుంటున్నాను అని చెప్పాడు.

ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే వంశీ పైడిపల్లితో తన తదుపరి చిత్రం ఉండనుందని కన్ఫర్మ్ చేసాడు మహేష్.