ఆపద్భాందవుడు కాదంబరి కిరణ్


manam saitham charity

మనం సైతం సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సేవా సంస్థ శనివారం మరికొంత మంది పేదలకు ఆర్థిక సహాయం చేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కోటి, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకురాలు నందినీ రెడ్డి, నటుడు రాజీవ్ కనకాల, నటి రజిత, డాన్స్ మాస్టర్ సత్య, గాయని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా చినయోగి రెడ్డి, వర్షిత, లీలాధర్, మురళీ కృష్ణారెడ్డి, గన్నోజి గంగాధర్, అభిషేక్, దిలీప్ తేజా, కళ్యాణ్, డీవీకే నాగేశ్వరరావు, అభినయలకు చెక్ లను అందజేశారు.

అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…పరిశ్రమలో మంచి మనుషులు పెరుగుతూనే ఉన్నారు. వాళ్లలో కొందరు మన కార్యక్రమానికి వచ్చారు. నేను జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. అలాంటి సమయంలో కూడా ఎవరినీ నాకీ సహాయం చేయండి అని అడగలేదు. కానీ ఇవాళ మనం సైతం కోసం వెళ్తున్నప్పుడు ప్రతి పెద్ద వాళ్లూ నన్ను ఆదరిస్తున్నారు. మాకు సహాయం చేయాలని ఉంటుంది కానీ నిజాయితీ గల వేదిక దొరకడం లేదు. నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయి అని ప్రోత్సహిస్తున్నారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. పేదరికాన్ని రూపుమాపకున్నా వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలనేదే నా ధ్యైయం, లక్ష్యం. గతేడాది నేను విజ్ఞప్తి చేసి బతిమాలితే వివిధ ఆస్పత్రుల నుంచి 43 లక్షల రూపాయల బిల్లులు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికి 90 మందికి సహాయం చేశాం. పరిశ్రమలో చిరంజీవి, కృష్ణ గారి దగ్గర నుంచి ఎంతోమంది మనం సైతంకు చేయూత నిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్, కేటీఆర్ తో కలిసి పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నాం. కానీ ఇటీవల కొన్ని సంఘటనలు జరగడం వల్ల అది ప్రస్తుతానికి వాయిదా వేశాం. ప్రభుత్వం నుంచి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేటీఆర్ సహకారంతో దాదాపు 20 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలకు అందించాం. మా కార్యక్రమానికి వచ్చే పెద్దలు స్పందించి సహాయం చేస్తున్నారు కానీ నేనెవరినీ ఇవ్వండి అని అడగడం లేదు. నా సహాయ కార్యక్రమాలు చూసి దేశ విదేశాల నుంచి దాతలు స్పందిస్తున్నారు. ఇవాళ పదిమందికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మనం సైతం ఇవాళ లక్షా 26 వేల మంది పేదల సేవా సంస్థ. కులాలను బట్టి కాకుండా ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్లు పెట్టాలని మేము ప్రభుత్వాలకు ప్రతిపాదిస్తున్నాం. పేదవాడిని పట్టించుకునే ప్రభుత్వాల, నాయకుల వెంట మాత్రమే మనం సైతం ఉంటుంది. అన్నారు

నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ…పరిశ్రమలో ఇంత మంది పేదలు బాధపడుతున్నారని ఈ కార్యక్రమానికి వచ్చాక తెలిసింది. కాదంబరి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకు అభినందనలు. నా వంతుగా 50 వేల రూపాయలు సహాయం ఇస్తాను. అన్నారు.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ….మాటలు చెప్పడం సులువు. మైక్ ఇస్తే ఎవరైనా ప్రసంగాలు చేస్తారు. కానీ ఒక మంచి పని చేయడం చాలా కష్టం. కాదంబరి కిరణ్ అలాంటి శ్రమను తీసుకున్నాడు. తన ఆలోచనను ఆచరించి చూపిస్తున్నాడు. ఇంకా చాలా మందికి కాదంబరి సేవ చేయాలి. గొప్పగా ఉన్నామనుకునే పరిశ్రమలో ఉండి తోటి పేదలకు సహాయం చేయలేకపోవడం సిగ్గుచేటుగా ఉంది. అన్నారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ….నటుడిగా దర్శకుడిగా కాదంబరి కిరణ్ నాకు తెలుసు. కానీ ఇవాళ నేను ఆయన్ని దేవుడిగా చూస్తున్నాను. ప్రస్తుతం నేను దేవాలయం వెళ్లాలి. కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు. కానీ ఇక్కడికొచ్చాక ఇదే దేవాలయం అనిపించింది. ఇంతపెద్ద పరిశ్రమలో ఇంతమంది పేదలకు సహాయం చేసే అదృష్టం ఒక్క కాదంబరికే దక్కింది. అది దేవుడి సంకల్పమేమో. నేను కూడా చాలా మందికి సహాయం చేశాను. మనం సైతంకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అదంతా పేదలకు చేరుతుందనే నమ్మకం కలుగుతోంది. నా వంతుగా 50 వేల రూపాయలు అందిస్తున్నాను. అన్నారు.

 

మనం సైతం సభ్యులు, ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బందరు బాబీ మాట్లాడుతూ…కాదంబరి కిరణ్ అన్న పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం ఆపేసి నాలుగేళ్లవుతోంది. ఎందుకంటే అప్పుడే మనం సైతం సేవా సంస్థను స్థాపించాం. కొద్దిమందితో ప్రారంభమైన మనం సైతం ఇవాళ లక్షలాది మందికి చేరువవుతోంది. మనం సైతం వెంట మా సభ్యులంతా ఉంటాం. అన్నారు.