మణిశర్మ స్పీడ్ మాములుగా లేదుగా


మణిశర్మ స్పీడ్ మాములుగా లేదుగా
మణిశర్మ స్పీడ్ మాములుగా లేదుగా

దశాబ్దం క్రితం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మరో మాట లేకుండా మణిశర్మ అనే పేరు వినపడేది. 2000 ఆరంభం అటూ ఇటూ లో అటు టాప్ హీరోలకు, ఇటు యువ హీరోలకు సమానంగా సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ఘనత మణిశర్మది. ముఖ్యంగా ఆయన మెలోడీలకు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండేది. అలాంటి మణిశర్మ యువ సంగీత దర్శకుల రాకతో నెమ్మదించాడు. ఒకదశలో అసలు మణిశర్మ చేతిలో సినిమాలే లేకుండా పోయాయి. అయితే గతేడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో లెక్కలన్నీ మారిపోయాయి.

మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించేలా మణిశర్మ సంగీతం అందించడంతో పాటు మరోసారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాయ చేయడంతో మణిశర్మను కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వరసగా రామ్ నటిస్తోన్న రెడ్, పూరి జగన్నాథ్ నెక్స్ట్ చిత్రంతో పాటు చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీకి సంగీతం అందించే ఛాన్స్ కొట్టేసాడు. చిరంజీవి సినిమాకు చాలా ఏళ్ల తర్వాత సంగీతం అందిస్తున్నాడు మణిశర్మ. ఈ ఆల్బమ్ తో కూడా మ్యాజిక్ చేయగలిగితే మళ్ళీ టాప్ హీరోలకు ఫస్ట్ ప్రిఫెరెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక చిరంజీవి మూవీ విషయానికొస్తే ఈ సినిమాకు అప్పుడే మణిశర్మ పాటలన్నీ రికార్డ్ చేసేసారట. షూటింగ్ కూడా మూడు పాటలకు పూర్తైపోయిందని, ప్రస్తుతం నాలుగో పాట చిత్రీకరణ చేస్తున్నారని తెలుస్తోంది, ముందుగా పాటలు, ఫైట్లు అన్నీ పూర్తి చేసి తర్వాత టాకీ పార్ట్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. కేవలం నెల రోజుల్లోనే మణిశర్మ ఈ చిత్రానికి ట్యూన్లు సిద్ధం చేశారట. తర్వాత రెండు వారాల్లో పాటల రికార్డింగ్ ను పూర్తి చేసి దర్శకుడికి అందించినట్లు సమాచారం.

మణిశర్మలో మునుపటి స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదని చిరు – కొరటాల మూవీ యూనిట్ సభ్యులు వ్యాఖ్యానించుకుంటున్నారు. మరి ఈ సినిమాతో మెలోడీ బ్రహ్మ ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో ఏంటో.