
కరోనా ప్రపంచానికి సరికొత్త పాఠాలు నేర్పుతోంది. ఎప్పుగు ఎక్కడ చూడని విచిత్రాల్ని చూపిస్తోంది. చిత్ర విచిత్రాలు చేయిస్తోంది. డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఊహని కూడా తమ మదిలో రానివ్వని డైరెక్టర్స్ ఇప్పుడు వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత కథ ఆధారంగా `క్వీన్` పేరుతో గౌతమ్ మీనన్ ఓ వెబ్ సిరీస్‌ని రూపొందించిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్‌లో టెలీకాస్ట్ అవుతోంది. తాజాగా ఈ దర్శకుడి బాటలో మరో గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం అడుగులు వేయబోతున్నారు.
ప్రస్తుతం తన కలల ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ తారాగణంతో భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది. మళ్లీ షూటింగ్ ప్రారంభం కావాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రావాలి. దీంతో మణిరత్నం వెబ్ సిరీస్‌ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి మణిరత్నం శిష్యుడు దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్‌లో వినిపిస్తోంది.