టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న మెలోడీ బ్రహ్మ


టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న మెలోడీ బ్రహ్మ
టాప్ ఫామ్ లో దూసుకుపోతున్న మెలోడీ బ్రహ్మ

మెలోడీ బ్రహ్మ అనగానే మనకు గుర్తొచ్చే పేరు మణిశర్మ. తనదైన మెలోడీలతో దశాబ్దానికి పైగా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగాడు మణిశర్మ. తాను పనిచేసిన హీరోలు అందరికీ బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన ఘనత మణిశర్మకే దక్కుతుంది. అయితే గత కొంత కాలంగా పూర్తి డౌన్ అయిపోయాడు మణి. అదే సమయంలో దేవి శ్రీ ప్రసాద్, థమన్ లు టాప్ గేర్ వేయడంతో సినిమాలన్నీ వీరి ఖాతాలోకే వెళ్లిపోయాయి. ఇక ఇండస్ట్రీ నుండి ఎగ్జిట్ అయిపోయాడనుకున్న సమయంలో మణిశర్మకు ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. మెలోడీలు తన బలమైనా సరే ఇస్మార్ట్ శంకర్ లో వాటికి స్కోప్ లేకపోయినా మాస్ పాటలతోనే ఉర్రూతలూగించాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో చెప్పేదేముంది. ఇస్మార్ట్ శంకర్ విజయంలో మణిశర్మ పాత్ర చాలా కీలకం. అందుకే ఇప్పుడు మణిశర్మకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.

చిన్న, పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా ఇప్పుడు మణిశర్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మెలోడీ బ్రహ్మ 7 సినిమాలకు పనిచేస్తున్నాడు. ఈ చిత్రాలు అన్నీ ఇదే ఏడాది విడుదల కానుండడం విశేషం. రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చేసాక తన తర్వాతి చిత్రం రెడ్ కు కూడా మణిశర్మనే తీసుకున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మెలోడీ సాంగ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ఇక పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమాకు కూడా మణిశర్మనే తీసుకున్నాడు. అంతే కాకుండా వెంకటేష్ నటిస్తోన్న తాజా చిత్రం నారప్ప, సాయి ధరమ్ తేజ్ – దేవాకట్టాల కాంబినేషన్ లో ఇటీవలే మొదలైన చిత్రం, గోపీచంద్ చిత్రం సీటిమార్, వివి వినాయక్ చిత్రం శీనయ్యలతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్యకు కూడా మణిశర్మనే సంగీత దర్శకుడు. మరి ఈ ఆల్బమ్స్ ఏ రేంజ్ విజయం సాధిస్తాయో, మణిశర్మ మళ్ళీ మునుపటిలా టాప్ స్థాయికి చేరుకుంటాడేమో చూడాలి.