మణిశర్మకు సుడి మళ్ళీ తిరుగుతోంది!!


Manisharma bagging important projects again
Manisharma bagging important projects again

90ల జెనరేషన్ వారిని టాలీవుడ్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడగండి.. ఏ మాత్రం తడుముకోకుండా మణిశర్మ అని చెప్తారు. 2000వ సంవత్సరానికి అటూ ఇటూలో మణిశర్మ తన పాటలతో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి. ముఖ్యంగా మెలోడీ కొట్టాలంటే మణిశర్మ తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నాడు. టాప్ హీరోలందరికీ అప్పట్లో మణిశర్మనే మ్యూజిక్ కంపోజర్. చిరంజీవి, బాలకృష్ణలకు ఎన్నో మరపురాని సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు మణిశర్మ. తర్వాతి జెనరేషన్ హీరోలు మహేష్, పవన్ లకు కూడా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇక ఇతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో మణిశర్మ సిద్ధహస్తుడు. అలాంటి మణిశర్మ తర్వాత్తర్వాత నెమ్మదించాడు. దేవి శ్రీ ప్రసాద్, థమన్ లాంటి యువ సంగీత దర్శకులు రావడంతో పాటు తన సంగీతంలో కూడా పస తగ్గడంతో మణిశర్మకు అవకాశాలు సన్నగిల్లాయి. ఒక దశలో మొత్తంగా ఆగిపోయాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మణిశర్మ తనకు వచ్చే అవకాశాల పట్ల అసహనం వ్యక్తం చేసాడు కూడా.

మధ్యలో జెంటిల్ మ్యాన్, లయన్ అంటూ కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేసినా అది అప్పటికి బాగున్నాయి అనిపించాయి కానీ మణిశర్మ కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ఇక మణిశర్మ ఆశలన్నీ వదిలేసుకున్న క్రమంలో వచ్చింది ఇస్మార్ట్ శంకర్. ఈ ఒక్క సినిమాతో మణిశర్మ సుడి మళ్ళీ తిరగడం మొదలుపెట్టింది. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి మణిశర్మ మ్యూజిక్ ప్రధాన కారణం. ఇప్పటి యువతను ఆకట్టుకునే మాస్ బాణీలు అందించగలనని నిరూపించాడు మణిశర్మ. ఇక ఈ సినిమాలో కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రస్తావించే అవసరమేముంది. ఎప్పట్లానే తుక్కురేగ్గొట్టేసాడు.

ఈ ఒక్క సినిమాతో మళ్ళీ పెద్ద సినిమాల్లో మణిశర్మను కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే రామ్ తన తర్వాతి చిత్రం రెడ్ సినిమాకు కూడా మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడన్న వార్త తెలుగు సంగీత ప్రియులకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది మణిశర్మకు ఒక బంగారు అవకాశం. కొరటాల శివ సినిమాలో పాటలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. సీన్లను ఎలివేట్ చేయడంలో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సహాయం తీసుకుంటాడు. పైగా చిరంజీవి – మణిశర్మ కాంబినేషన్ లో గోల్డెన్ హిట్స్ ఉన్నాయి. సో ఈ కాంబో చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.

ఇక్కడితో అయిపోలేదు. వెంకటేష్ తాజాగా ఎంతో ఇష్టపడి ఎంచుకున్న అసురన్ రీమేక్ కు మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారట. అసురన్ చిత్రంలో మ్యూజిక్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో పాటలు తక్కువే ఉన్నా నేపధ్య సంగీతానికి బోలెడంత స్కోప్ ఉంది. ఈ కారణాలతోనే మణిశర్మను అప్రోచ్ అయినట్లున్నారు. మరి మణిశర్మ ఈ మూడు సినిమాలకు అదిరిపోయే అవుట్ ఫుట్ ఇస్తే మరింత మంది హీరోలు మణిశర్మతో పనిచేయడానికి సిద్ధపడతారనడంలో సందేహం లేదు.