`మాస్ట‌ర్‌` మూవీ రివ్యూ

`మాస్ట‌ర్‌` మూవీ రివ్యూ
`మాస్ట‌ర్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు:విజ‌య్‌, విజ‌య్ సేతుప‌తి, మాళ‌వికా మోహ‌న‌న్‌, శంత‌న్ భాగ్య‌రాజ్‌, అర్జున్ దాస్‌, నాజ‌ర్‌, ర‌మ్య సుబ్ర‌హ్మ‌ణియ‌న్ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం:  లోకేష్ క‌న‌గ‌రాజ్‌
నిర్మాత‌: గ్జేవియ‌ర్ బ్రిట్టో
సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌న్ సూర్య‌న్‌
ఎడిటింగ్:  ఫిలోమిన్ రాజ్‌
విడుద‌ల తేదీ: 13- 01- 2021
రేటింగ్: 3/5

తెలుగులో తుపాకి, పోలీసోడు, అదిరింది, బిగిల్‌ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాల్ని సొంతం చేసుకోవ‌డంతో హీరో విజ‌య్ చిత్రాల‌కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `మాస్ట‌ర్‌`. ఈ చిత్రంపై కూడా స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `ఖైదీ` చిత్రంతో అబ్బుర ప‌రిచిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు కావ‌డం, విల‌క్ష‌ణ న‌టుడు, హీరో విజ‌య్ సేతుప‌తి ఇందులో విల‌న్‌గా న‌టించిన‌డంతో ఈ మూవీపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన `మాస్ట‌ర్‌` అంద‌రి అంచ‌నాల‌కు అనుగునంగానే వుందా?  విజ‌య్ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలోనే వుందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
జేడీ (విజ‌య్‌) ఓ కాలేజీ ప్రొఫెస‌ర్‌. సెయింట్ జేవియ‌ర్ కాలేజీలో ప‌ని చేస్తూ అక్క‌డి విద్యార్థుల‌కు హాట్ ఫేవ‌రేట్ గా నిలుస్తాడు. ఇది కాలేజీ యాజ‌మాన్యానికి ఇష్టం వుండ‌దు. ఇదే స‌మ‌యంలో కాలేజీలో విద్యార్థి సంఘాల ఎన్నిక‌లు మొద‌ల‌వుతాయి. ఈ క్ర‌మంలో కాలేజీలో గొడ‌వ‌లు జ‌రుగుతాయి. దీంతో ప్రొఫెస‌ర్ జేడీని బాల‌నేర‌స్థుల శిక్ష‌ణ కోసం బాల‌నేర‌స్తుల స్టేట్ అబ్జ‌ర్వేష‌న్ హోమ్‌కి మాస్ట‌ర్‌గా వెళ‌తాడు. అక్క‌డి నుంచి భ‌వానీ (విజ‌య్ సేతుప‌తి)కి జేడీకి మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. ఈ హోమ్‌ని అడ్డు పెట్టుకుని భ‌వానీ అరాచ‌కాల‌కు పాల్ప‌డుతుంటాడు. ఇంత‌కీ భ‌వానీ ఎవ‌రు? అత‌నికి జేడీ ఎలా బుద్ధి చెప్పాడు?.. చారు ( మాళ‌విక మోహ‌న‌న్‌)కున్న ప్రాధాన్య‌త ఏంటి అన్న‌దే ఈ చిత్ర క‌థ‌.

న‌టీన‌టులు:
హీరో విజ‌య్ ఇందులో మాస్ట‌ర్‌గా క‌నిపించారు. ఆయ‌న పాత్ర క్లాస్ అయినా ఊర మాస్ అంశాల‌తో సాగిన తీరు విజ‌య్ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌ధ‌మార్థంలో తాగుబోతుగా క‌నిపించినా ఆ త‌రువాత ఆ పాత్ర‌ని న‌డిపించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. మాస్ట‌ర్ పాత్ర‌లో త‌న‌దైన స్టైల్ న‌ట‌న‌తో విజయ్ అల‌రించారు. ఇక ప్ర‌తినాయ‌కుడిగా భ‌వానీ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించారు. ఆయ‌న పాత్ర సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌రుడుగ‌ట్టిన వ్య‌క్తిగా దారుణాలు చేస్తూ ఎమోష‌న‌ల్ అవుతూ ఆ పాత్ర‌కు ప్రాణం పోశారు. సినిమాలో క‌థ‌నాయిక పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. వున్నంత వ‌రకు ఓకే అనిపించింది మాళ‌విక మోహ‌న‌న్‌. మిగ‌తా పాత్ర‌ల్లో శంత‌న్ భాగ్య‌రాజ్‌, అర్జున్ దాస్‌, నాజ‌ర్‌, ర‌మ్య సుబ్ర‌హ్మ‌ణియ‌న్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించి ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
ఎడిట‌ర్ ఫిలోమిన్ రాజ్ మిన‌హా మిగ‌తా విభాగాల‌న్నీ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసిన‌ట్టుగా తెలుస్తోంది. అన‌వ‌ర‌స‌ర సాగ‌దీత స‌న్నివేశాల్ని ప‌క్క‌న పెట్టాల్సింది. ఆ విష‌యంలో ఎడిట‌ర్ ఫిలోమిన్ రాజ్‌విఫ‌లం అయ్యాడు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ పాట‌లు, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకునేలా వుంది. స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఎక్స్ ‌బీ ఫిల్మ్ క్రియేట‌ర్స్ గ్జేవియ‌ర్ బ్రిట్టో నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. అయితే క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రింత దృష్టిపెడితే బాగుండేది.

తీర్పు:
ఎంత‌కీ సినిమా విజ‌య్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగునంగా స‌న్నివేశాల్ని రాసుకున్న‌ట్టుగా వుందే కానీ ఎక్క‌డా అన్ని వ‌ర్గాల‌ని అల‌రించేలా లేదు. మాటి మాటికి విజ‌య్ మాస్ డ్యాన్సులు, డ‌ప్పుల మోత‌లు త‌ప్పి చెప్పుకోవ‌డానికి సినిమాలో ఏమీ లేదు. స‌గ‌టు ప్రేక్ష‌కుడికి చిరాకు తెప్పించే స‌న్నివేశాలే ఎక్కువ‌. `కొంత భాగం మెగ‌స్టార్ మాస్ట‌ర్‌ని గుర్తు చేసేలా వుంది. విజ‌య్‌, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ల్ని బ‌లంగా మ‌లిచిన లోకేష్ క‌న‌గ‌రాజ్ వాటి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్ని మాత్రం గాలికి వ‌దిలేసిన్టుగా క‌నిపిస్తోంది. దీంతో ఈ సినిమా విజ‌య్ ఫ్యాన్స్‌కి త‌ప్ప స‌గ‌టు ప్రేక్ష‌కుడికి ఏమాత్రం రుచించ‌దు.