2020 మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్.. ఎందుకంటే


2020 మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్.. ఎందుకంటే
2020 మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్.. ఎందుకంటే

అత్యధిక మంది హీరోలు కలిగిన ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీ గురించి చెప్పుకోవచ్చు. 9 మంది హీరోలకు పైగా ఈ ఫ్యామిలీ నుండి వచ్చారు. ఏడాదికి ఒక్కొక్కరు ఒక్క సినిమా చేసినా దాదాపు ఏడాది అంతా వారి సినిమాలు రిలీజైన భావన కలుగుతుంది. పైగా వరుణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కూడా ఏడాదికి రెండు సినిమాలు చొప్పున చేస్తున్నారు. 2019లో వీరిద్దరి కంబ్యాక్ చూసిన మెగా ఫ్యాన్స్ కు 2020 మరింత స్పెషల్ గా నిలవనుంది. అసలు 2020 ఆరంభమే వారికి సూపర్ హ్యాపీని ఇచ్చిందని చెప్పవచ్చు.

నా పేరు సూర్యతో ప్లాప్ కొట్టి, ఏడాది పాటు సినిమా ఏం చేయకుండా ఖాళీగా ఉండిపోయిన అల్లు అర్జున్ ఆ బ్రేక్ కు తగ్గట్లుగా వడ్డీతో కలిపి ఇచ్చేసాడు. అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ చేసేసింది. ఇక 2020 మొత్తం మెగా ఫ్యాన్స్ కు పండగ వాతావరణాన్ని తీసుకురానుంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ ను స్టార్ట్ చేసేసాడు. మే లో ఈ చిత్రం విడుదల కానుంది. రెండు భాషల్లో హిట్ అయిన ఈ చిత్రం మూడో భాషలో కూడా హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ గతేడాది రెండు హిట్స్ కొట్టారు. ఈ ఏడాది వీరిద్దరూ సోలో బ్రతుకే సో బెటరు, బాక్సర్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇవి కాకుండా వీరిద్దరి నుండి మరో రెండు సినిమాలు రానున్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.

సైరా చిత్రంతో విజయం అందుకున్న చిరంజీవి, కొరటాల శివతో చేసే చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్ ఉంటుంది. కొరటాల శివ ట్రాక్ రికార్డ్ బట్టి చూసుకుంటే ఈ సినిమా సక్సెస్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది, ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్ ఒక హీరోగా నటిస్తోన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకుడు అంటే రికార్డులు బద్దలుకావడం ఖాయం. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది.