మెగా 152.. కాలం కలిసొస్తే ఎదురుండదు


మెగా 152.. కాలం కలిసొస్తే ఎదురుండదు
మెగా 152.. కాలం కలిసొస్తే ఎదురుండదు

పెద్ద సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ వేరుగా ఉంటుంది. అందులోనూ చాలా నెలల తర్వాత పెద్ద సినిమా అంటే దానికుండే ఆదరణ ఎక్కువ. ఈ సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల ద్వారా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత బడా హీరోల సినిమాలు ఇప్పట్లో లేవు. ఆర్ ఆర్ ఆర్ జులైలో అనుకున్నారు కానీ అది అప్పటికి రావడం అసాధ్యమని తేలిపోయింది. దసరాకు రావాలా లేక వచ్చే ఏడాదా అని ఆలోచించుకుంటున్నారు. సో, సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద సినిమా మెగా 152నే అవ్వనుంది.

నిజానికి మే నెలలోనే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న పింక్ రీమేక్ విడుదల కానుంది. అయితే పింక్ రీమేక్ కమర్షియల్ చిత్రం కాదు. అందులోనూ పవన్ కు పెద్ద రోల్ అంటూ ఉండదు. ఎండింగ్ కూడా అన్ కన్వెన్షనల్ గా ఉంటుంది. పవన్ రీ ఎంట్రీని ప్రేక్షకులు ఎంత వరకూ స్వాగతిస్తారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో చేసే సినిమానే పెద్ద సినిమా అవ్వనుంది. గ్యాప్ తర్వాత వచ్చే భారీ కమర్షియల్ చిత్రం కావడంతో మెగా 152కు అడ్వాంటేజ్ భారీగా ఉండే అవకాశముంది.

ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15 వారాంతంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే మొదలైంది. దేవాదాయ శాఖలో జరిగే అవినీతి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని వార్తలు అందుతున్నాయి. డీసెంట్ బడ్జెట్ లో తక్కువ వర్కింగ్ డేస్ లో ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మణిశర్మ ట్యూన్స్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.