`ఓ పిట్ట క‌థ` కోసం మెగాస్టార్ వ‌చ్చేస్తున్నారు!


`ఓ పిట్ట క‌థ` కోసం మెగాస్టార్ వ‌చ్చేస్తున్నారు!
`ఓ పిట్ట క‌థ` కోసం మెగాస్టార్ వ‌చ్చేస్తున్నారు!

ఈ మ‌ధ్య త‌న‌కు న‌చ్చిన ప్ర‌తీ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ఎంక‌రేజ్ చేస్తున్నారు. క‌థ‌బ‌ల‌మున్న చిత్రాలు, కొత్త త‌ర‌హా కాన్సెప్ట్‌తో తెర‌పైకి వ‌స్తున్న చిత్రాల్ని ప్రోత్స‌హిస్తూ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ అయ్యేలా వాటికి ప్ర‌చారం చేస్తున్నారు. స్వ‌యంగా ఆయ‌నే మీడియా ముందుకు వ‌చ్చి కొత్త త‌ర‌హా చిత్రాల్ని ఆద‌రించండ‌ని ప్రేక్ష‌కుల్ని కోరుతున్నారు. తాజాగా మెగాస్టార్ మ‌రో చిన్న చిత్రానికి అండ‌గా నిలుస్తున్నారు.

అదే `ఓ పిట్టక‌థ‌`. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ‌గా పేరున్న భ‌వ్యా క్రియేష‌న్స్ అధినేత వి. ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వంత్ దుద్దంపూడి, బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్‌రావు, నిత్యాశెట్టి, బ్ర‌హ్మాజీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చెందు ముద్దు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. వెంక‌ట ల‌క్ష్మి అనే ఓ అమ్మాయి నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం స్క్రీన్‌ప్లే ప్ర‌ధానంగా సాగుతుంద‌ని తెలుస్తోంది. చిన్న పాయింట్‌ని అద్భుతంగా ద‌ర్శ‌కుడు తెర కెక్కించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని, న‌చ్చితే ప‌దిమందికి చెప్పండ‌ని, న‌చ్చ‌క‌పోతే వంద మందికి చెప్పండ‌ని నటుడు బ్ర‌హ్మాజీ ప్ర‌చారం చేస్తున్నారు.

మార్చి 6న రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం స్వ‌యంగా మెగాస్టార్ చిరంజీవి క‌ద‌ల‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మార్చి 1న ఈ చిత్రం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి హీరో మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కాబోతున్నారు. దీంతో ఈ సినిమాపై ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది.