కాపీ వివాదంలో మెగాస్టార్ `ఆచార్య‌`?


కాపీ వివాదంలో మెగాస్టార్ `ఆచార్య‌`?
కాపీ వివాదంలో మెగాస్టార్ `ఆచార్య‌`?

టాలీవుడ్‌లో కాపీ వివాదాలు కొత్తేమీ కాదు. గ‌త కొంత కాలంగా త‌మ క‌థ‌ని  కాపీ చేశార‌ని, టైటిల్‌ని త‌మ అనుమ‌తి లేకుండానే లేపేశార‌ని గ‌త కొంత కాలంగా వివాదాలు తెర‌పైకి వ‌స్తూనే వున్నాయి. తాజాగా అలాంటి వివాదంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చిక్కుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ని చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ధ‌ర్మ‌స్థ‌లి నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌కు అన్ని వ‌ర్గాల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్‌ని త‌న సినిమా క‌థ నుంచి కాపీ కొట్టారంటూ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు క‌న్నెగంటి అనిల్ కృష్ణ సంచ‌ల‌న ఆరోణ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`పుణ్య‌భూమి` అనే టైటిల్‌తో ఓ క‌థ‌ని ర‌చ‌యిత‌ల సంఘంలో 2006లో రిజిస్ట‌ర్ చేయించాన‌ని, `ఆచార్య` మోష‌న్ పోస్ట‌ర్‌లో ధ‌ర్మ‌స్థ‌లి అనే ఎపిసోడ్‌ని త‌న క‌థ నుంచి లేపేశార‌ని అనిల్ కృష్ణ వెల్ల‌డించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. దీనిపై `ఆచార్య‌` టీమ్, మెగాస్టార్ ఎలా స్పందిస్తారో చూడాలి. గ‌తంలో కొర‌టాల శివ తెర‌కెక్కించిన `శ్రీ‌మంతుడు` చిత్రం కూడా క‌థాచౌర్యం వివాదంలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కీల‌క పాత్ర‌లో హీరో రామ్‌చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్‌ స్టూడెంట్ లీడ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు.