సుకుమార్‌పై మెగాస్టార్ ప్ర‌శంస‌లు!

సుకుమార్‌పై మెగాస్టార్ ప్ర‌శంస‌లు!
సుకుమార్‌పై మెగాస్టార్ ప్ర‌శంస‌లు!

వైష్ణ‌వ్ తేజ్‌ని హీరోగా ప‌రిచయం చేస్తూ తెర‌కెక్కించిన చిత్రం `ఉప్పెన‌`. అద్భుత‌మైన ప్రేమ కావ్యంగా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి స్టార్ డైరెక్ట‌ర్, లెక్క‌ల మాస్టారు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా త‌న శిష్యుడు బుచ్చిబాబు సానాని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశారు.

క‌న్న‌డ సోయ‌గం కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో విజ‌య్‌సేతుప‌తి విల‌న్‌గా కీ రోల్‌ని పోషించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై రికార్డు సృష్టిస్తోంది. ఈ చిత్రంపై సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌కి ప్ర‌త్యేక గిఫ్ట్‌ల‌ని అందించి స‌ర్‌ప్రైజ్ చేశారు. తాజాగా సుకుమార్‌కి కూడా ఆ దే బ‌హుమ‌తిని పంపించారు. దానితో పాటు ఓ లేఖ‌ని కూడా జ‌త చేశారు.

ఆ లేఖ‌ని సుకుమార్ సోష‌ల్ మీడియా ఫేస్ బుక్‌లో పంచుకుని మురిసిపోయారు. `కొణిదెల చిరంజీవి, మ‌ద్రాసు, ఇండియా, ఈ అడ్ర‌స్‌కు చిన్న‌ప్పుడు అమాయ‌కంగా రాసిన లేఖ‌ల‌కు ఇప్పుడు ప్ర‌తిలేఖ వ‌చ్చినంత అనుభూతి గా వుంద‌ని త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఇదే సంద‌ర్భంగా చిరు  లెక్క‌ల మాస్టారిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ఓ లేఖ‌ని పంచుకున్నారు.

`డియ‌ర్ సుకుమార్‌.. పాఠాలు చెప్పిన గురువుగానే కాకుండా సినీ పాఠాలు నేర్పిన గురువుగా బుచ్చిబాబు లాంటి ఎంతో టాలెంటెడ్ శిష్యుల‌ని నువ్వు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి అందిస్తున్నందుకు నీకు నా అభినంద‌న‌లు..అగ్ర ద‌ర్శ‌కుడిగా వుంటూనే ఈ `ఉప్పెన‌`చిత్ర నిర్మాణ బాధ్య‌త‌ల‌లోనూ పాలు పంచుకుని వాటిని అద్భుతంగా నెర‌వేర్చినందుకు నీకు నా శుభాకాంక్ష‌లు. నువ్వు, నీ అనేక శిష్యులు రాబోయే రోజుల్లో చిత్ర ప‌ర‌శ్ర‌మ‌కు, ప్రేక్ష‌కుల‌కు మ‌రెన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను అందిస్తార‌ని న‌మ్ముతున్నాను. కోరుకుంటున్నాను. ప్రేమ‌తో చిరంజీవి అని ఓ లేఖ‌ని సుకుమార్‌కు పంపించారు.